Share News

Water Heater Explosion: పేలిన వాటర్ హీటర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 20 , 2025 | 02:05 PM

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

Water Heater Explosion: పేలిన వాటర్ హీటర్..  ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Nallakunta Fire Accident

హైదరాబాద్, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో ఇవాళ (శనివారం) ఘోర అగ్ని ప్రమాదం (Nallakunta Fire Accident) చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒక కుటుంబం ఎదుర్కొన్న ప్రమాదం క్షణాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, సకాలంలో పోలీసులు తీసుకున్న చర్యలతో ఏడుగురు కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డెర బస్తీలోని ఓ ఇంటి మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులు వాటర్ హీటర్‌ను ఆన్ చేసి మర్చిపోయారు. కాసేపటికి హీటర్ అధిక ఉష్ణోగ్రతకు చేరుకుని ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడుతో మంటలు చెలరేగి మొదటి అంతస్తు అంతటా వ్యాపించాయి. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టీవీ, ఫ్రిజ్ వంటి పరికరాలు మంటల్లో చిక్కుకోవడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.


ఈ ఇంటి మూడో అంతస్తులో ఏడుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగతో నిండిన ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందిన వెంటనే నల్లకుంట పోలీసులు ఎలాంటి ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంతో మెట్లమార్గాన్ని కూడా ఉపయోగించలేని పరిస్థితి మారింది. పోలీసులు తాడు సహాయంతో పై అంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులను కిందకు దించారు. ఒక్కొక్కరిని జాగ్రత్తగా కిందకు దిచ్చి మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో పోలీసుల ధైర్యసాహాసాలు, అప్రమత్తతను స్థానికులు ప్రశంసించారు.


అగ్ని ప్రమాదంలో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులకు భారీ నష్టం వాటిళ్లినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరికీ ఊరట ఇచ్చింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే వరకు స్థానికులు కూడా సహకరించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు.


ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. వాటర్ హీటర్‌లు, గీజర్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరం లేని సమయంలో ఆన్‌లో ఉంచకూడదని తెలిపారు. పాత ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 02:11 PM