Share News

TS Rain Alert: వానలే వానలు.. కామారెడ్డిలో రికార్డు స్థాయి వర్షపాతం

ABN , Publish Date - Aug 28 , 2025 | 07:18 AM

హైదరాబాద్‌ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TS Rain Alert: వానలే వానలు.. కామారెడ్డిలో రికార్డు స్థాయి వర్షపాతం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో.. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పలు జిల్లాల్లో.. రహదారులపై నీరు చేరింది. మరోకొన్ని చోట్ల.. ప్రధాన రహదారులు వర్ష బీభత్సానికి కొట్టుకుపోయాయి. దీంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా కుంభవృష్టి చోటుచేసుకోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


అలాగే.. హైదరాబాద్‌లో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని లింగంపల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, రాయదుర్గం, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమై నగరాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.


కాగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్‌లో 42 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయం అయ్యింది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి.


కామారెడ్డి బికనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్‌లోని వడ్యాల్‌లో 27.58, కామారెడ్డి లోని తాడ్వాయి‌‌‌‌లో 27, మెదక్ జిల్లాలోని సర్ధానా‌లో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేట్‌లో 24.1 , మెదక్ లోని నాగపూర్‌లో 23.65, నిర్మల్‌లోని విశ్వనాథ్ పేట్‌లో 23.38, ముజిగి లో 22 , లింగంపేట్ లో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.


కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా.. వరద ప్రాంతాలను ఇవాళ(గురువారం) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించనున్నారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీయనున్నారు. భారీ వర్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్

Updated Date - Aug 28 , 2025 | 07:50 AM