BJP On Court Stay: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా వాడుకుంటోంది..
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:35 PM
ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ చేతకాని తనం కారణంగానే.. ఈ తీర్పు వెలువడిందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.
అందుకే ముందగానే ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ లేదని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50% క్యాప్‌ను నిర్దేశించిందని గుర్తు చేశారు. ఈ విషయం తెలిసినా.. రాజ్యాంగపరమైన నిబంధనలపై కనీస అవగాహన లేకుండా రేవంత్ సర్కారు వ్యవహరించిందని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టే రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం: రామ్‌చందర్ రావు
బీసీ రిజర్వేషన్లపై స్టే రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్‌లకు బీజేపీ మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు. బీసీల అంశాని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు. గవర్నర్‌కి పంపిన తర్వాత బిల్లు కోసం 3 నెలల సమయం ఉంది.. ఎందుకు తొందర పడుతునారని సూచించారు.
బిల్లు ఆమోదానికి 3 నెలల సమయం ఉండగా ఎందుకు బిల్లు తెచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని రామ్‌చందర్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే.. ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని మాట్లాడుతారు తప్ప.. కనీసం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ నేతలు మైండ్ అప్లై చేశారా.. అని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన బాధ్యత మీది. ఆర్డినెన్సు తెచ్చింది మీరు.. బిల్లు తెచ్చింది మీరు.. కానీ బీజేపీనీ అంటునారని రామ్‌చందర్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..