CM Revanth Reddy On Teachers Day: విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకురావాలి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:52 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ విద్య కంటే సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. టీచర్స్ డే సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు..
ఉద్యమంలో టీచర్లది కీలకపాత్ర..
తెలంగాణ ఉద్యమంలో టీచర్లది కీలకపాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదం చేర్చింది టీచర్లే అని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఉపాధ్యాయులది ముఖ్యమైన పాత్ర అని చెప్పుకొచ్చారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు. విద్యాశాఖలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అందుకే విద్యాశాఖను తానే పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. తరచూ టీచర్ల సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు గుర్తు చేశారు.
గత పదేళ్లుగా విద్యారంగం నిర్లక్ష్యం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయలేదని విమర్శించారు. గత పదేళ్లు విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ముచేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. గతంలో గురుపూజోత్సవానికి సీఎం వచ్చారా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు.
పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే..
ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది చదువుతున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక 3 లక్షల మంది విద్యార్థులు.. ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి చేరారని హర్షం వ్యక్తం చేశారు. టీచర్లకు జీతాలు ఇవ్వడమే కాదు.. సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. CSR ఫండ్స్ నుంచి స్కూల్స్‌కు అదనంగా రూ.130 కోట్లు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే నొక్కిచెప్పారు. స్కూళ్లలో పిల్లలతో కలిసి టీచర్లు కూడా మధ్యాహ్న భోజనం చేయాలని ఆయన సూచించారు.
రెండోసారి, మూడోసారి సీఎం అవుతా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓయూకు వీసీని కూడా నియమించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక సోషల్ జస్టిస్ విత్ మెరిట్‌తో వీసీని నియమించామని వివరించారు. విద్య, పేద పిల్లల పట్ల టీచర్లు బాధ్యతగా ఉండాలని సూచించారు. విద్యలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీ వేసినట్లు చెప్పారు. మీరు బాగా పనిచేస్తే రెండోసారి, మూడోసారి సీఎం అవుతా అని.. చెప్పుకొచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉండను.. కష్టపడతా, మీరు కష్టపడి పనిచేయాలని ఉద్ఘాటించారు.
ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనివ్వను..
పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని టీచర్లు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలిసోతెలీకో కొంతమంది పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నచిన్న పట్టణాలకు డ్రగ్స్ చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. తప్పుదోవ పడుతున్న పిల్లలను దారిమళ్లించాలని టీచర్లకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గడ్డపై ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనివ్వను అని నొక్కిెచెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా.. వాళ్ల సంగతి తేల్చేందుకే ఈగల్ ఫోర్స్ పనిచేస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం