Hyderabad: ‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:14 AM
స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఉన్న గ్రైండర్ అనే యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితో పాటు కొంటున్న మరో ఏడుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు విక్రేతలతో పాటు కొంటున్న ఏడుగురి అరెస్టు
రూ.15 లక్షల విలువైన 100 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
నిందితులంతా స్వలింగ సంపర్కులు.. ప్రత్యేక గుర్తులతో డ్రగ్స్ సమాచారం
అంబర్‌పేట/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఉన్న గ్రైండర్ అనే యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితో పాటు కొంటున్న మరో ఏడుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ స్వలింగ సంపర్కులు (గేలు) కావడం విశేషం. ప్రధాన నిందితుడు హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడు. ఈస్ట్ జోన్ డీసీపీ బీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ చిలకలగూడ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి 2000లో వివాహం జరగ్గా.. రెండేళ్ల తర్వాత విడాకులు పొందాడు.
అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. స్వలింగ సంపర్కుడిగా ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, పరేడ్ గ్రౌండ్స్ వద్ద బస్టా్‌పలలో ఉంటూ విటులను ఆకట్టుకునేవాడు. దీంతో అతనికి హెచ్‌ఐవీ పాజిటివ్ సోకడంతో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మీర్‌పేటలో నివాసం ఉండే మరో వ్యక్తి డ్రగ్స్ కేసులో జైలుకెళ్లి 4 నెలల క్రితం బయటకొచ్చారు. వీరు గ్రైండర్ యాప్‌లో చేరి ‘గేల’ను ఆకట్టుకుంటున్నారు. గ్రైండర్ యాప్ గురించి తక్కువమందికి తెలియడం, నిఘా లేకపోవడాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఇతర సభ్యులతో చాటింగ్ సమయంలో డ్రగ్స్ ప్రస్తావన తెచ్చి, డ్రగ్స్ వాడే వారిని గుర్తిస్తున్నారు. డ్రగ్స్ అందుబాటులో ఉన్నదీ లేనిదీ తెలిపేందుకు ప్రత్యేక గుర్తులు వాడుతున్నారు. ప్రధాన నిందితుడు బెంగళూరులో ఉండే ఓ నైజీరియా దేశస్థుడిని నుంచి ఒక గ్రాము ఎండీఎంఏ 10 వేలకు కొని రూ.15 వేలకు అమ్ముతున్నాడు. డ్రగ్స్ కొంటున్న ఏడుగురిలో ఒక డాక్టర్ కూడా ఉన్నాడు.