Sahasra Murder Case: సహస్రను చంపింది పక్కింటి బాలుడే.. బ్యాట్ కోసమే మర్డర్..
ABN , Publish Date - Aug 23 , 2025 | 02:11 PM
కూకట్‌పల్లికి చెందిన పదకొండేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రికెట్ కిట్ కొనుక్కోవాలనే కోరిక పదిహేనేళ్ల కుర్రాడిని హంతకుడిగా మార్చిందని పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు.
హైదరాబాద్: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు ఎవరో పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అభం శుభం ఎరగని పదకొండేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా చంపింది పక్కింటి కుర్రాడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంట్లో దొంగతనం, మర్డర్ కోసం బాలుడు రెండ్రోజులు ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌లో చూసే క్రైమ్ సీన్స్, సినిమాల స్ఫూర్తితో స్కెచ్ వేసుకుని.. ఆ ప్రకారమే సహస్రను హత్య చేశాడని బాలానగర్ డీసీపీ ప్రకటించారు. క్రికెట్ కిట్ కోసమే బాలుడు ఈ హత్యకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సహస్ర హత్య అనంతరం అనుమానంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయసు 15 ఏళ్లే అయినప్పటికీ.. విచారణలో మాత్రం అతడు క్రిమినల్ ఇంటెలిజెంట్‌లా వ్యవహరించి పోలీసులను తప్పుదోవ పట్టించాడని బాలానగర్ డీసీపీ వెల్లడించాడు. ఆధారాల్లేకుండా హత్యచేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన బాలుడు.. చివరికి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సమాచారంలో అడ్డంగా దొరికిపోయాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను విచారించగా.. హత్య జరిగిన రోజున ఓ బాలుడు గోడదూకి అపార్ట్‌మెంట్‌లోకి రావడాన్ని గమనించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ దిశలో పోలీసులు దర్యాప్తు చేయగా బాలుడే హంతకుడనే స్పష్టమైంది.
అనంతరం బాలుడు సహస్రను హత్య చేసినట్లు అంగీకరించాడు. క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని బాలిక ఇంటికి చోరీ కోసం వెళ్లానని.. తర్వాత కత్తితో ఆమెను హత్య చేసి ఇంటికొచ్చి కత్తిని శుభ్రంగా కడిగానని ఒప్పుకున్నాడు. టీషర్ట్‌కు రక్తపు మరకలు అంటడంతో వాషింగ్ మెషీన్లో వేశానని చెప్పాడు. క్రైమ్ మూవీస్ చూసే అలవాటు ఉందని.. దొంగతనం చేయడం, తప్పించుకోవడంపై ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశానని వెల్లడించాడు. చోరీకి రెండు రోజుల ముందే బాలుడు ప్లాన్ వేసుకున్నాడు. అలాగే, చోరీలు, హత్యల గురించి బాలుడు రాసుకున్న పుస్తకాన్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.
సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కూతుర్ని చంపిన బాలుడికి ఉరి శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశాడు. అతడికి ఏ మాత్రం భయం, పశ్చాతాపం లేవని.. పెద్దవాళ్ల తరహాలో హత్యకు పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. కాగా, నిందితుడి తల్లి తల్లి సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా.. తండ్రి ఏ పని చేయడం లేదు. అతడికి ఇద్దరు అక్కలు ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి..
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్‌లో OpenAI కంపెనీకి కేటీఆర్ ఆహ్వానం..
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..