New DGP Shivdhar Reddy: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:03 PM
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి (New DGP Shivdhar Reddy)ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి.
శివధర్ రెడ్డి ప్రస్థానం ఇదే..
తెలంగాణ డీజీపీగా బి. శివధర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి. హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే ఆయన చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు అందించారు.
జిల్లాల ఎస్పీగా, డీఐజీ ఎస్‌ఐబీ(DIG SIB)గా మావోయిస్టుల అణిచివేతలో కీలకపాత్ర పోషించారు శివధర్ రెడ్డి. 2014 నుంచి 2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2016 నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌ను ప్లాన్ చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా పని చేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజల్లో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడారు శివధర్ రెడ్డి. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా పనిచేశారు. పర్సనల్ వింగ్‌లో ఐజీ, అడిషనల్ డీజీగా పని చేశారు. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గానూ అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మళ్లీ శివధర్ రెడ్డిని నియమించింది. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్‌తో సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
For More TG News And Telugu News