Kiran Kumar VS KTR: కేటీఆర్‌కు ఆ దమ్ముందా.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:08 PM
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను కేసీఆర్ (KCR) కనిపెట్టినట్లు కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో నాలుగు ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు సెల్ఫీ పాయింట్ తప్పా ఏలాంటి అభివృద్ధి జరగలేదని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బరాబర్‌గా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాం.. 42శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని సవాల్ విసిరారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని కేటీఆర్ అంటున్నారని.. పదేళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా.? అని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిన గులాబీ పార్టీకి.. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కి సున్న వచ్చిందని దెప్పిపొడిచారు. కంటోన్మెంట్‌లో గులాబీ పార్టీ మూడో స్థానానికి దిగజారిందని విమర్శించారు. మీడియా సమావేశాలు మూడు పూటలా పెట్టకపోతే.. ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పతివ్రత మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌ను మీ కుటుంబం వాడుకొని.. ఆర్థికంగా ఎదిగిందని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ అభివృద్ధి కుంటు పడలేదని చెప్పుకొచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
హరీష్‌రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డెంగ్యూ మరణాల సంఖ్య ఉందని గుర్తుచేశారు. కేవలం రేవంత్ రెడ్డి హయాంలో మాత్రమే డెంగ్యూ వస్తోందని.. ఎప్పుడూ లేదన్నట్లు హరీష్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. వర్షాకాలం వచ్చిందంటే.. డెంగ్యూ వస్తుందని తెలిపారు. ఓబీసీలకు రిజర్వేషన్ కావాలనే తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తోందని తెలిపారు. బీజేపీకి పది మంది ఎమ్మెల్యేలు లేరని.. స్థానిక సంస్థల్లో సగం స్థానాలు ఎలా వస్తాయని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని సబ్ కమిటీ వేశామని నొక్కిచెప్పారు. బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని..మెట్రో ఫేజ్- 2 వచ్చేదని స్పష్టం చేశారు. తెలంగాణకి రావాల్సిన వాటాను గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి
వారిద్దరూ రాహుల్‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.