Minister Uttam:తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణ: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:42 PM
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుందిల్లా లింక్ ద్వారా కొత్త అలైన్‌మెంట్‌తో 10 నుంచి 12 శాతం వ్యయం తగ్గే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
హైదరాబాద్, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు (Pranahita Chevella Project)ని తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు మంత్రి ఉత్తమ్.
సుందిల్లా లింక్ ద్వారా కొత్త అలైన్‌మెంట్‌తో 10 నుంచి 12 శాతం వ్యయం తగ్గే అవకాశం ఉందని వివరించారు. భూసేకరణ సగం మేరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్లు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. కొత్త అలైన్‌మెంట్ సాంకేతికంగా, బలంగా ఉండేలా రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణతో సమతౌల్యంగా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి పెట్టామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తక్కువ పొడవు ఉన్న కాలువలు, టన్నెళ్లతో నిర్మాణ వ్యయం తగ్గనుందని వివరించారు. పంప్ హౌస్‌ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క పంప్‌హౌస్ 30 మెగావాట్ల సామర్థ్యం ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగం తగ్గి, నిర్వహణ సులభతరం కానుందని చెప్పుకొచ్చారు. సుందిల్లా లింక్ ద్వారా ప్రాజెక్టు పర్యావరణపరంగా సానుకూల మార్గంలో ముందుకెళ్లనుందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కొత్త డీపీఆర్ కోసం భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ సర్వేలు మళ్లీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డీపీఆర్ పూర్తయ్యాక రాష్ట్ర కేబినెట్ ముందుకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రణాళిక తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీటిని, హైదరాబాద్‌కి తాగునీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News