Share News

Minister Uttam: కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పట్టించారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:44 PM

ప్రతిపక్షాలు సాగు, నీటి ప్రాజెక్ట్‌లపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Minister Uttam: కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పట్టించారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పట్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లకు మాజీ సీఎం కేసీఆర్ మెయింటనెన్స్ చేయలేదని మండిపడ్డారు. ఇవాళ(శనివారం) జూరాల ప్రాజెక్ట్‌‌ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్లను, 4,8 గేట్స్‌ ఐరన్‌ రోప్‌లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. భారీ వాహనాలను జూరాలపై నడపటం సేఫ్టీ కాదని ఆనాడే అధికారులు నిర్థారించారని... కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జూరాల డ్యామ్‌కు అనుసంధానంగా మరో బ్రిడ్జికి రూ. 100 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


భారీ వాహనాల వల్ల జూరాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం ఉందని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున రూ. 100 కోట్లు మరో బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రాజెక్ట్‌లను పట్టించుకోకపోవడంతోనే దెబ్బతింటున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పూడికతీత పనులు కూడా చేపట్టలేదని ధ్వజమెత్తారు. జూరాల ప్రాజెక్ట్ పూడికతీత పనులు వెంటనే చేపడతామని స్పష్టం చేశారు. రూ.300 కోట్లతో రెండవ గ్యాంటి క్రెన్ మంజూరు చేస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


4 టీఎంసీల నీటిని ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నింపేలా పనులు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 90శాతం పూర్తయినా నెట్టెంపాడు పనులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో నెట్టెంపాడుకి రూ.2,753 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. డిసెంబర్ నాటికి వందశాతం పనులు చేసి నెట్టెంపాడు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మక్తల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. ఇరిగేషన్ శాఖలో 1100 మంది ఇంజనీర్లను నియమించామని ప్రకటించారు. ప్రతిపక్షాలు సాగు, నీటి ప్రాజెక్ట్‌లపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. ఇరిగేషన్ శాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


జూరాల ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారం: మంత్రి వాకిటి శ్రీహరి

వర్షాలు ముందుగా రావడంతో జూరాల ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాల నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేశారని చెప్పారు. కాళేశ్వరం కుంగిపోతే ఏమికాదని మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు జూరాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసిన.. వారు నమ్మరని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

దేశ రాజధానిలో బోనాల జాతర

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 05:58 PM