Share News

KTR Gadwal Sabha: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం..

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:56 PM

గట్టు ఎత్తిపోతల పథకాన్ని నానబెట్టి నీళ్లివ్వని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. తాను ఇక్కడికి వస్తుంటే ఓ నాయకుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు.

KTR Gadwal Sabha: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం..
KTR

జోగులాంబ గద్వాల: తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి రోజు నుంచే మాజీ సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాలకు సంక్షేమ ఫలాలు అందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్వాల గర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ.. 1,275 2BHK ఇళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఇళ్లకు రంగులు మార్చి ముగ్గురు మంత్రులు జనాలకు ఇచ్చారని ఎద్దేవా చేశారు.


ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి..

గట్టు ఎత్తిపోతల పథకాన్ని నానబెట్టి నీళ్లివ్వని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. తాను ఇక్కడికి వస్తుంటే ఓ నాయకుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నవంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్రశ్నించిన ఎమ్మెల్యే అప్పట్లో రైలు కింద తలబెట్టి చనిపోతా గాని.. కాంగ్రెస్‌‌లో చేరనని చెప్పి.. ఇపుడు పార్టీ మారారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ధి కోసం పార్టీ మారిన అని చెబుతున్నారని.. పార్టీ మారిన తరువాత ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.


సిగ్గు లేకుండా బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారు...

ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌ పార్టీకి పోయి సిగ్గు లేకుండా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడ బీఆర్ఎస్ సభ జరుగుతుంటే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సంకలో చేరారని విమర్శించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా సుప్రీంకోర్టు చాలా సీరియస్‌‌గా ఉందని గుర్తు చేశారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ఏ సంక్షేమ పథకాలు ఆగలేదు..

కరోనా అప్పుడు ఆదాయం సున్నా అయినా.. ఏ సంక్షేమ పథకాలూ ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌‌కు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. దివాలా తీశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని బీసీలకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఎవరైనా ఏదైనా అడిగితే గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటానని సీఎం బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని అన్ని వర్గాలవారు బాధ పడుతున్నారని చెప్పుకొచ్చారు.


గులాబీ జెండా ఎగరవేయాలి..

ప్రజల విజ్ఞత, చైతన్యాన్ని అవహేళన చేసిన పది మంది ఎమ్మెల్యేలను ఏమనాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల్లో స్త్రీ లింగం, పురుషలింగం ఉంటాయని.. వీళ్లు ఏ లింగమో వారే చెప్పాలని ధ్వజమెత్తారు. తొమ్మిది నెలల్లో ఎమ్మెల్యేల ఉపఎన్నిక వస్తుందని.. అంతకన్నా ముందే స్థానిక సంస్థల ఎన్నికల వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. అన్ని ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక్కడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం సాగితే.. రైతులను జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏ పోరాటం ఉన్నా బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామారెడ్డి, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా

బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

Updated Date - Sep 13 , 2025 | 10:10 PM