KTR: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:59 PM
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు చేసినవి అసత్య ఆరోపణలేనని అన్నారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి (Mahesh Kumar Goud) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ (మంగళవారం) లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మహేష్ గౌడ్ చేసినవి అసత్య ఆరోపణలేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ తన చేతగానీతనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే భేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు: న్యాయవాదుల స్పష్టత
కాగా, మరోవైపు కేటీఆర్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదుల బృందం స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని, గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించారు.
ఫార్ములా ఈ -కార్ రేస్ విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్ ఇవ్వాలనే ఏసీబీ అంశంపై కేటీఆర్ న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమికంగా కేటీఆర్ న్యాయవాదులు పేర్కొనదాన్ని ప్రకారం... ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినదని న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఫార్ములా ఈ -కార్ రేస్ నిర్వహణ పూర్తిగా అధికారుల యంత్రాంగం ద్వారా సాగిందని అన్నారు. ఇందులో కేటీఆర్ నిర్ణయానికి మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారని న్యాయవాదులు స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్పా, వ్యక్తిగత సంభాషణలకు సంబంధించినది కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ వేధింపుల కోణంలో మొబైల్ ఫోన్ అడగటం వెనుక న్యాయ సమ్మతమైన కారణాలు లేవని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు.
విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే వ్యక్తిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని న్యాయవాదులు గుర్తు చేశారు. పైగా, వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాక, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందని అన్నారు.
ఈ చట్టాల ప్రకారం కేవలం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి పర్సనల్ డివైసులు అడగవచ్చని వివరించారు. అంతేకాక, ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవని అన్నారు. ఎటువంటి నిధుల దుర్వినియోగం లేకుండా, స్కాంలు లేని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోందని కేటీఆర్ న్యాయవాదులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News And Telugu News