KCR Meeting: కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ.. కవిత ఆరోపణలపై చర్చలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 07:14 PM
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రేపు(ఆదివారం) కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట: ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నాలుగు గంటల నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి ప్రభుత్వం అప్పగించిన విషయంపై ఆదివారం కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే.. ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఫామ్ హౌస్‌లోనే హరీష్ రావు, కేటీఆర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపటి సమావేశాల తరువాత మీడియా సమావేశం లేదా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
అయితే మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించిన విషయం తెలిసిందే. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తలాగా తాను పాతికేళ్లు పనిచేశానని వ్యాఖ్యానించారు.
తనపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తనపై దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని హరీష్‌రావు హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశాల అనంతరం బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేస్తోంది అనే దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్