Share News

AIADMK Rift Widens: అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:30 PM

పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో దిండిగల్‌లోని ఓ హోటల్‌లో పళనిస్వామి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.

AIADMK Rift Widens: అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
Sengottiyan and EPS

మదురై: అన్నాడీఎంకేలో విభేదాలు ముదిరాయి. పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యుడు కేఏ సెంగోట్టియన్‌ (KA Sengottiayan)ను పార్టీ పదవుల నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) శనివారంనాడు తొలగించారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వచ్చాయి. సెంగోట్టియన్ ప్రస్తుతం ఈరోడ్ సబర్బన్ వెస్ట్ డిస్ట్రిక్‌కు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ, జిల్లా సెక్రటరీగా ఉన్నారు.


పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో దిండిగల్‌లోని ఓ హోటల్‌లో పళనిస్వామి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామిని కలిసిన వారిలో మాజీ మంత్రులు దిండిగల్ శ్రీనివాసన్, నాథం విశ్వనాథన్, కేపీ మునుసామి, ఎస్‌పీ వేలుమణి, కామరాజ్, ఓసీ మణియన్, విజయభాస్కర్ తదితరులు ఉన్నారు.


సెంగోట్టియన్ స్పందన

అన్నాడీఎంకే అధిష్ఠానవర్గం పార్టీ పదవుల నుంచి తనను తప్పించడంపై సెంగోట్టియన్ సంతోషం వ్యక్తం చేసారు. 'ఐ యామ్ హ్యాపీ' అని చెప్పారు. వీకే శశికళ, ఓ పన్నీర్‌ సెల్వం, టీటీవీ దినకరన్‌తో సహా బహిష్కృత నేతలందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని సెంగోట్టియన్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే ఈ చర్య తప్పనిసరని శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా పార్టీ సీనియర్ నేతలు ఈపీఎస్‌ను కలిసి పార్టీని వీడిన వారిని వెనక్కి తీసుకురావాలని కోరామని, అయినప్పటికీ తమ సలహాను ఈపీఎస్ ఖాతరు చేయలేదని అన్నారు. ఐక్య అన్నాడీఎంకే కోసం తాను కృషి చేస్తున్నానని, 2016 నుంచి ఏ ఎన్నికలు తమకు అనూకూలంగా రాలేదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే తమకు 30 సీట్లు వచ్చేవని అన్నారు. బహిష్కృత నేతలను తిరిగి పార్టీలోకి తీసుకుంటేనే అన్నాడీఎంకే ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందని కుండబద్ధలు కొట్టారు. ఈ నేపథ్యంలో సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి ఈపీఎస్ తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

For More National News And Telugu News

Updated Date - Sep 06 , 2025 | 05:10 PM