Hydra Demolitions: హైడ్రా దూకుడు.. భాగ్యనగరంలో మరోసారి కూల్చివేతలు
ABN , Publish Date - Oct 04 , 2025 | 08:34 AM
కొండాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్‌లోని భిక్షపతి నగర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది.
హైదరాబాద్, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో హైడ్రా అధికారుల (Hydra Officials) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ (శనివారం) కొండాపూర్ (Kondapur)లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాని పోలీసులు అనుమతించండం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్నారు పోలీసులు.
కాగా.. కొండాపూర్‌లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. దాదాపు రూ.720 కోట్ల 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ - 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారని హైడ్రా అధికారులు తెలిపారు. అయితే, గతంలో రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది రంగారెడ్డి కోర్టు. రంగారెడ్డి కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. 36 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చింది హైకోర్టు. హై కోర్టు తీర్పు మేరకు శనివారం ఆక్రమణల తొలగింపును చేపట్టామని హైడ్రా అధికారులు చెప్పుకొచ్చారు. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
కాగా, హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయి. కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తోండటంతో చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..
Read Latest TG News And Telugu News