Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:30 AM
హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.
హైదరాబాద్: రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న.. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకతప్పడం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని రోజుకో కొత్త పద్దతిలో మోసాలకు ఒడిగడుతున్నారు.
చిన్నా, పెద్దా తేడా లేకుండా.. దారుణాలకు పాల్పడుతున్నారు. పైసాపైసా కష్టపడి కూడబెట్టిన డబ్బును క్షణాల్లో లాగేసుకుంటున్నారు. బెదిరింపు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ప్రాణాలు కొల్పోయిన వారు లేకపోలేరు. తాజాగా.. ఇలాంటి దారుణ ఘటనే నగరంలో వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కేసు నమోదు అయ్యిందని దుండగులు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెంగుళూరు పోలీస్ లోగోతో వరుసగా బాధితురాలికి కాల్స్ చేసినట్లు చెప్పారు.
ఫేక్ ఐడీ, ఫేక్ కోర్ట్ స్టాంప్‌లతో ఉన్న డాక్యుమెంట్లు చూపించి ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. అప్పటికే మహిళ రూ. 6.6 లక్షల పెన్షన్ డబ్బులను మోసగాళ్లకు పంపినట్లు గుర్తించినట్లు వివరించారు. అయినా.. ఇంకా డబ్బులు కావాలని సైబర్ నేరగాళ్లు వేధించడంతో.. తీవ్ర మనస్థాపనానికి గురైన రిటైర్డ్ మహిళా అధికారి గుండె పోటుతో మృతి చెందింది.
అయితే.. మహిళ చనిపోయిన తరువాత కూడా సైబర్ నేరగాళ్లు కాల్స్, మెసేజెస్ చేయడంతో.. అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న బాధితురాలి కొడుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నేరపూరిత హత్య కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు