Share News

Renu Aggarwal Case: రేణు అగర్వాల్‌ హత్య కేసులో నిందితులు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:39 PM

రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌‌లో భర్త, కుమారుడితో నివాసం ఉంటుంది. అయితే.. హర్ష కొద్ది రోజుల క్రితమే ఆ ఇంట్లో పనికి కుదిరాడు.

Renu Aggarwal Case: రేణు అగర్వాల్‌ హత్య కేసులో నిందితులు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు..
CP Avinash Mohanty

హైదరాబాద్: కూకట్‌‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. రేణు అగర్వాల్‌ను హత్య చేసిన ఇద్దరు నిందితులు రోషన్, హర్షను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీపీ ఇవాళ(శనివారం) మీడియాతో మాట్లాడారు.


కుక్కర్‌తో కొట్టి..  కాళ్లు, చేతులు కట్టేసి..

రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌‌లో భర్త, కుమారుడితో నివాసం ఉంటుంది. అయితే.. హర్ష కొద్ది రోజుల క్రితమే ఆమె ఇంట్లో పనికి కుదిరాడు. రోషన్ కూడా అదే అపార్ట్మెంట్‌‌ పైఅంతస్తులో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. కాగా, రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు, బంగారం ఉన్నట్లు నిందితులు తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీన రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే నిందితులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో ఇంట్లో పనిచేసుకుంటున్న రేణు తలపై కుక్కర్‌తో మోదారు. ఆ తర్వాత ఆమె కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం ఇంట్లోని 7 తులాల బంగారు ఆభరణాలు, పది వాచ్‌‌లు, డబ్బుతో పరారయ్యారు.


రాంచీలో పట్టుబడ్డ నిందితులు..

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను రాంచీకి చెందిన వారిగా గుర్తించినట్లు సీపీ అవినాశ్ పేర్కొన్నారు. 2023లో రోషన్‌పై మూడు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. 8వ తేదీ నుంచి దోపిడీకి ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిన్న(శుక్రవారం) రాంచీ వద్ద ఇద్దరు నిందితులు పట్టుబడ్డారని స్పష్టం చేశారు. హర్ష అనే నిందితుడు మత్తు పదార్థాలు సేవిస్తాడని, గతంలో రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఈ కేసులో రోషన్ సోదరుడినీ అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయపడ్డాడని తెలిపారు.


హఫీజ్‌‌పేట్ టు రాంచీ..

నిందితులిద్దరూ హత్య అనంతరం హఫీజ్‌‌పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారని సీపీ అవినాశ్ వివరించారు. నిందితులు హఫీజ్‌‌పేట్ నుంచి సికింద్రాబాద్‌‌కు MMTS టికెట్లు తీసుకున్నారన్నారని తెలిపారు. కానీ స్టేషన్‌‌లో పోలీసులను చూసి హఫీజ్‌‌పేట్ నుంచి డైరెక్ట్‌గా రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. టీవీలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చారని చెప్పారు. సమాచారం మేరకు రాంచీ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. రాత్రి ఒంటి గంటకు హఫీజ్‌‌పేట్ నుంచి క్యాబ్‌లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు రాంచిలో దిగినట్లు సీపీ స్పష్టం చేశారు. నిందితుల విచారణ అనంతరం మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Updated Date - Sep 13 , 2025 | 05:58 PM