Harish Rao: సీఎం రేవంత్ బరితెగించి మాట్లాడుతున్నారు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:02 PM
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద ముంపు బాధితులను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. తలసాని తనవంతు సహాయంగా బస్తీ వాసులను ఆదుకుంటున్నారని తెలిపారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కస్తూర్బానగర్‌లో వరద ముంపునకు గురైన 1,500 కుటుంబాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాలాలు క్లీన్ చేయటం లేదని విమర్శించారు. నగరంలో 7, 8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు.
ప్రభుత్వం విఫలమైంది..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద ముంపు బాధితులను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. తలసాని తనవంతు సహాయంగా బస్తీ వాసులను ఆదుకుంటున్నారని తెలిపారు. నగరంలో రోడ్లు గుంతలమయం అయ్యాయి. గుంతలు పూడ్చే తెలివి లేదుగాని ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు సిటీలో నాలాలు, రోడ్లు బాగు చేయాలంటూ హితవు పలికారు. పోర్టు సిటీ కాంట్రాక్టర్ల కోసం ఆరాటం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఇంతకంటే బరితెగింపు మాటలు ఉంటాయా..?
కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట.. ఇంతకంటే బరితెగింపు మాటలు ఉంటాయా..? అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారినట్లు ట్విట్టర్‌లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. పది మందిని పార్టీలో చేర్చుకున్నామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని సీఎం సిగ్గు లేకుండా చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
బతుకమ్మ పండుగ వచ్చిందని, పండుగ పూట వీధి దీపాలైనా వెలిగేటట్టు చూడాలని హరీష్ రావు కోరారు. లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని ఆరోపించారు. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ ఇది రేవంత్ పాలన అని ఎద్దేవా చేశారు. పండగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు చూడాలని కోరారు. వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు పరిహారం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్