Share News

Giriraj Singh: ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:28 PM

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు సహకారం ఎందుకు అందించడం లేదని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.

Giriraj Singh: ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్
Giriraj Singh on Cotton Procurement

ఢిల్లీ, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): గతంలో ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం అయ్యాయని.. ఇప్పుడు కూడా దుర్వినియోగం అవుతున్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) విమర్శించడమే కాదని.. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం నిలవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తమ బాధ్యత నుంచి ఎందుకు తప్పుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఎంత పత్తి ఉత్పత్తి అయితే అంత కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు స్మార్ట్ ఫోన్స్ లేకుండానే DBT నిధులు వెళ్తున్నాయా అని ప్రశ్నించారు గిరిరాజ్ సింగ్.


తెలంగాణ నుంచి రూ. 65 వేల కోట్ల పత్తి కొనుగోళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 నుంచి 2014 వరకు రూ.12, 500 కోట్ల పత్తి కొనుగోళ్లు చేస్తే.. ప్రస్తుతం రూ.73,000 కోట్ల పత్తి కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు. రూ. 65 వేల కోట్ల పత్తి కొనుగోళ్లు కేవలం తెలంగాణ నుంచే జరిగాయని వెల్లడించారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టామని ఉద్ఘాటించారు. 2014లో క్వింటా పత్తి ధర రూ.3,700లు ఉంటే.. ఇప్పుడు క్వింటా రూ.7,710ల ధర ఉందని నొక్కిచెప్పారు. మరో గ్రేడ్ రకం గతంలో క్వింటా రూ. 4 వేలు ఉంటే.. ప్రస్తుతం క్వింటా రూ. 8,110లుగా ఉందని వివరించారు. ఇవాళ(మంగళవారం) కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు గిరిరాజ్ సింగ్.


క్వాలిటీ సీడ్స్ ఇవ్వాలి..

తెలంగాణలో 80 శాతం పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో 20 లక్షల మంది పత్తి రైతులు ,18 లక్షల హెక్టార్లలో పత్తి పంట పండిస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు సహకారం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. పత్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అప్లికేషన్ ప్రారంభించిదని... రైతులు అందులో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్ల కోసం గతేడాది 110 సెంటర్లు ఉన్నాయని.. ఇప్పుడు122 సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనను కోరారని చెప్పుకొచ్చారు. గతంలో పత్తిని ఎంత సేకరించామో.. ఈ ఏడాది కూడా అలానే పత్తిని సేకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతుగా నిలవాలని సూచించారు. పత్తిలో తేమ శాతాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ స్థాయిలో ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం క్వాలిటీ సీడ్స్ ఇవ్వాలని సూచించారు గిరిరాజ్ సింగ్.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 06:04 PM