Kishan Reddy Letter to Bhatti: మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:13 AM
Kishan Reddy Letter to Bhatti: ఆల్ పార్టీ ఎంపీల సమావేశంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ భట్టికి లేఖ రాశారు.
హైదరాబాద్, మార్చి 8: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన (Deputy CM Bhatti Vikramarka) ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఈరోజు (శనివారం) ప్రజాభవన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల ఎంపీలతో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), బండి సంజయ్‌లకు (Bandi Sanjay) స్వయంగా భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే భట్టి ఆహ్వానంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భట్టి పంపిన లేఖ ఆలస్యంగా అందిందని.. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు.
కిషన్ రెడ్డి లేఖ ఇదే...
భట్టి పంపింన ఆహ్వానం ఆలస్యంగా అందిందని... సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార, అనధికార కార్యక్రమాలతో ఎంపీల సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉందని.. చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి తాము కృషి చేస్తూనే ఉంటామని లేఖలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా.. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరుకాకూడదని ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా.. మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభంకానుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు అన్ని పార్టీల ఎంపీలకు భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రం తరపున అన్ని పార్టీల ఎంపీలు గళమెత్తాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.1,800 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. మెట్రో రైలు రెండో దశ కింద రూ.24,269 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.14,100 కోట్లు, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే పది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు, గోదావరి-మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు రూ.7,440 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. హైదరాబాద్‌లో సమీకృత మురికి నీటి మాస్టర్ ప్లాన్‌కు, వరంగల్‌లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని రాష్ట్రం అడుతోంది. ఆయా అంశాలపై ఎంపీల సమావేశంలో చర్చించి కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందించనున్నారు.
ఇవి కూడా చదవండి...
seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Read Latest Telangana News And Telugu News