Share News

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:39 AM

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం

అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు

వారికి ప్రభుత్వపరంగా 45% ప్రోత్సాహకాలు: సీఎం

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సంఘం.. అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ఇండియా (ఎలీప్‌) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. అనకాపల్లిలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటవుతున్న తొలి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పుడు మహిళలు కూడా అపారమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని తెలిపారు. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మహిళల కోసం వర్క్‌ ఫ్రం హోం (ఇంటి నుంచే పని) విధానాన్ని కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళలు ఇంట్లో కూర్చునే మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువస్తామని తెలిపారు.


టాటా ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ ద్వారా సహకారం

భారతీయ మహిళలు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉండాలనే తమ ఆకాంక్షను నిజం చేసి చూపిస్తామని చంద్రబాబు చెప్పారు. మహిళా సాధికారతకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా 45 శాతం ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన పారిశ్రామిక పాలసీలను అమలు చేస్తున్నామని వివరించారు. వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చే వారి ఎవరికైనా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్స్‌ ద్వారా అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.



వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అనుమతులు

పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలు రిజిస్ట్రేషన్లు, అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా గంటల వ్యవధిలోనే ధ్రువపత్రాలు సెల్‌ఫోన్లకు వస్తాయని చెప్పారు. మొత్తం 1000 రకాల ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే అందించబోతున్నట్లు చంద్రబాబు వివరించారు. 30 ఏళ్ల క్రితం వంటింటికే పరిమితమైన మహిళలకు సాధికారత కల్పించడం కోసం తాను డ్వాక్రా సంఘా లు ప్రారంభించానని చంద్రబాబు గుర్తు చేశారు. వంట చేయడానికి తన తల్లి పడిన కష్టాలే ‘దీపం’ పథకం ప్రారంభించడానికి తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ‘దీపం-2’ పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.

పెద్ద ఆర్మీగా మహిళా శక్తి

డ్వాక్రా సంఘాల్లో చేరిన సామాన్య మహిళలు కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకుని ఆర్థిక స్వావలంబనతో అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా, మెప్మా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న 1.50 కోట్ల మహిళలతో అది పెద్ద ఆర్మీగా మహిళాశక్తి రూపుదిద్దుకుందని తెలిపారు. డ్వాక్రా మహిళలను ఎంఎ్‌సఎంఈల వైపునకు మళ్లించి.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. బ్యాంకు లింకేజీలతో స్వయం సహాయక సంఘాలకు రూ.14వేల కోట్ల మేర రుణాలు అందించేందుకు బ్యాంకులతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పా రు. ఎలీప్‌ అధ్యక్షురాలు కె.రమాదేవి, ఈ మహిళా సదస్సు కన్వీనర్‌ జ్యోతి, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఎంపీ కేశినేని శివనాథ్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, డైరెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 04:39 AM