CM Revanth Reddy: ఉచిత కరెంట్ అంటే.. వైఎస్ పేరు గుర్తుకు వస్తుంది..
ABN , Publish Date - Sep 02 , 2025 | 09:57 PM
సమకాలీన రాజకీయాల్లో కొందరు అధికారం ఉన్నపుడు మిత్రులుగా వస్తారు.. అధికారం పోయాక మాయం అవుతారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ కేవీపీ రామచంద్ర రావు అలా కాదని, చివరి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడుగా నిలబడిన ఒకే ఒక్క మనిషి కేవీపీ అని పేర్కొన్నారు.
హైదరాబాద్: రైతులకు వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారని తెలిపారు. ఉచిత విద్యుత్‌పైన తొలి సంతకం చేయడంతో పాటు రైతుల విద్యుత్ బకాయిలను, వారిపైన పెట్టిన కేసులను ఆయన రద్దు చేశారని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొని మీడియాతో మాట్లాడారు.. చదువుకునే రోజుల నుంచి మరణం వరకు వైఎస్‌కి కేవీపీ రామచంద్ర రావు తోడు నీడగా నిలబడ్డారని గుర్తు చేశారు.
వైఎస్‌కి తోడుగా కేవీపీ...
సమకాలీన రాజకీయాల్లో కొందరు అధికారం ఉన్నపుడు మిత్రులుగా వస్తారు.. అధికారం పోయాక మాయం అవుతారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ కేవీపీ రామచంద్ర రావు అలా కాదని, చివరి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడుగా నిలబడిన ఒకే ఒక్క మనిషి కేవీపీ అని పేర్కొన్నారు. కేవీపీ రామచంద్ర రావు లాగా ఉంటానని కొంతమంది తన దగ్గరకి వస్తున్నారని తెలిపారు. తప్పులను తన ఖాతాలో, మంచిని వైఎస్ ఖాతాలో కేవీపీ వేసే వారని చెప్పుకొచ్చారు. సర్వం త్యాగం చేయగల గుణం, సమస్యలను ఎదురుకునే శక్తి కేవీపీ సొంతమని కితాబిచ్చారు. రూ.2 రూపాయలకు కిలో బియ్యాన్ని రూపాయికే ఇచ్చారని స్పష్టం చేశారు. ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్లే.. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తున్నారని నొక్కిచెప్పారు.
రుణ విముక్తి కల్పించాం..
తెలంగాణలో 3.10 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కూడా వైఎస్ స్ఫూర్తి ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలోనే 2 లక్షల రైతులకు రుణమాఫీ చేసామని వివరించారు. రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కల్పించామని స్పష్టం చేశారు. వరి వేస్తే ఊరే అని గత సీఎం అంటే.. మేం వరి వేస్తే రూ.500 రూపాయల బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. వరిని చివరి గింజ వరకు కొన్నామని పేర్కొన్నారు.
రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం..
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కరవు, వలసలను నివారించడం కోసం గోదావరి జలాలను తీసుకు రావడానికి వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారని గుర్తు చేశారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం ఎస్ఎల్బీసీని వైఎస్ ఏర్పాటు చేశారు. 30 కిలోమీటర్ల సొరంగం తవ్విన తర్వాత పనులు ఆపేశారని ఆయన పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీని తమ ప్రభుత్వం పూర్తిచేసి రైతుల కలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన జీవిత ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని వైఎస్ గతంలో ప్రకటించారని చెప్పుకొచ్చారు. తాను, వైఎస్ షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తామని వివరించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బడ్జెట్‌పైన ప్రభుత్వాన్ని నిలదీశానని సీఎం చెప్పారు. అధికారంలో ఉన్నపుడు అహంకారం లేకుండా ఆలోచనతో ప్రతిపక్షాలకు వైఎస్ సమాధానం చెప్పేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..