Share News

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:56 AM

తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా.. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana state formation celebrations) ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రావతరణ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల పోరాటంతో పన్నెండో సంవత్సరంలోకి తెలంగాణ అడుగుపెడుతోందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా.. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


అదే స్ఫూర్తిని రేవంత్ ప్రభుత్వం కొనసాగించాలి: కేసీఆర్‌

Ex-CM-KCR.jpg

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తిని రేవంత్ ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్‌ కోరారు.

తెలంగాణ భవన్‌లో వేడుకలు...

బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం 10గంటలకు జాతీయ జెండాను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారీ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో మాజీమంత్రి హరీష్‌రావు, తెలంగాణ భవన్ ఇన్‌చార్జ్ రావుల చంద్రశేఖరరెడ్డి, కార్యకర్తలు పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మాజీమంత్రి హరీష్‌రావు సమావేశంకానున్నారు.


ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటమే ఫలితమే తెలంగాణ: హరీష్‌రావు

Harish Rao

తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు ఇవాళ విముక్తి లభించిన రోజని అన్నారు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం ఇవాళ అని తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్‌ సచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదని కొనియాడారు. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితమే తెలంగాణ అని అభివర్ణించారు. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివని హరీష్‌రావు కొనియాడారు.


పరేడ్‌గ్రౌండ్‌లో...

కాగా, తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. సోమవారం నాడు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్‌ టేకుచి పాల్గొంటారు. ఆయా జిల్లాల్లో జెండాలను మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ఎగురవేయనున్నారు.


శాసన మండలిలో వేడుకలు...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసన మండలిలో జాతీయ పతాకాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ , అమీర్ అలీఖాన్ , అంజిరెడ్డి , దయానంద్ , తక్కెళ్లపల్లి రవిందర్‌రావు , వాణీదేవి , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2025 | 07:34 AM