Share News

Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్‌లో గర్భిణి ప్రసవం..

ABN , Publish Date - Aug 27 , 2025 | 11:23 AM

ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్‌లో గర్భిణి ప్రసవం..

హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం రాజస్థాన్‌కు చెందిన రేష్మ అనే మహిళ క్యూలైన్‌లో నిల్చుంది. అప్పటికే ఆమె గర్భవతి కావడంతో నొప్పులతో.. క్యూ లైన్‌లోనే పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన చూసిన భక్త జనాలు.. వినాయకుడి కృపతోనే తల్లిబిడ్డ క్షేమంగా బయటపడ్డారని స్వామి వారిని కొనియాడుతున్నారు.


అయితే.. ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు. భారీ బందోబస్తుతో పాటు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు, 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు.


బడా గణేశ్‌ను చూడటానికి వివిధ ప్రదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మరో పక్క వర్షం పడుతుండటంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గణపతికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల హోమాలు చేస్తారు.. అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకువచ్చి గణపతి మెడలో వేస్తారు. వినాయకుడి కళ్యాణంతో పాటు పదవి విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే లక్ష వినాయక నామార్చన చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Updated Date - Aug 27 , 2025 | 11:33 AM