Heavy Rain: రెండు రోజులు స్కూళ్లకు సెలవులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:17 AM
ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వానతో వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయి..
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇద్దరి మృతి.. ఇద్దరు గల్లంతు
ఎడతెరిపిలేని వానతో స్తంభించిన జనజీవనం
వరంగల్ నగరంలో ఇంట్లోకి చొచ్చుకొచ్చిన వరద నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతి
జనగామ పెద్దవాగులో కొట్టుకొచ్చిన మృతదేహం
నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
హైదరాబాద్‌లో ఉదయం తరగతులు మాత్రమే
ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రంహోం.. హైడ్రా సూచన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వానతో వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయి.. జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నిత్యావసరాలు, సామగ్రి తడిసిపోయాయి. వరంగల్ నగరంలోని కాశికుంట వాంబే కాలనీలో ఇంట్లోకి చొచ్చుకువచ్చిన వరద నీటిలో మునిగి.. పసునూటి బుచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మొదలైన కుంభ వృష్టి సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు చెరువుల్లా మారాయి. వరద అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతా ఇంటి డాబాలపైకి ఎక్కారు. గుడిసెలు, రేకుల ఇళ్లలోని వారు వరద మొదలవగానే ఇళ్లు విడిచి ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాఽధితుల కోసం ఐదు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లోకి భారీగా వరద చేరి పట్టాలు మునిగిపోయాయి. తర్వాత మెల్లగా వరద తగ్గడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదు. మరోవైపు భారీ వర్షాలతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిలుకల వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో హైదరాబాద్ నగరం పరిధిలో మూసీ నదిలో వరద పెరిగింది. ముందుజాగ్రత్తగా ముసారాంబాగ్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. కాగా, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక్కడి పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి కందికట్ల ఉప్పలయ్య (65) ఆకేరు వరదలో గల్లంతయ్యారు. సంగారెడ్డి జిల్లా యూసు్‌ఫపూర్ శివారులోని బ్రిడ్జిని దాటుతుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. మరోవైపు జనగామ జిల్లా రఘునాథపల్లి రైల్వే ట్రాక్ సమీపంలోని పెద్దవాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. ఆ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. అతడికి సుమారు 40-45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు.
5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో.. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ బుధ, గురువారాలు సెలవు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని సూచించింది.
మంచంపై నిద్రపోయి.. అలాగే నీట మునిగి..
భారీ వర్షంతో వరంగల్‌లోని కాశికుంట వాంబే కాలనీలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆ వరద ఇంట్లోకి చొచ్చుకురావడంతో మంచంపై నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలు పసునూటి బుచ్చమ్మ (80) అలాగే నీట మునిగి మృతిచెందారు. ఆమె కుమారుడు గతంలోనే మరణించడంతో.. కోడలు కళావతి, మనవరాలు కృపతో కలిసి ఉంటున్నారు. ఆమె మృతితో వారు విషాదంలో మునిగిపోయారు.
నేడు, రేపు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని మండలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం మండలాల్లో అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్లకుపైగా, మిగతా చోట్ల 11-20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతుందని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం.. వరంగల్ జిల్లా సంగెంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వాన పడిందని, సూర్యాపేట జిల్లా నాగారంలో 18.7, తిరుమలగిరిలో 18, వరంగల్ జిల్లా ఖిలావరంగల్‌లో 15.7, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 13.2, వర్థన్నపేటలో 12.8, జనగామ జిల్లా కొడకండ్లలో 12.3, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
వానొస్తే బడి సంద్రమే!
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థులను అధికారులు ట్రాక్టర్‌లో బయటికి తీసుకువస్తున్న దృశ్యమిది. ఇందులో 240మంది విద్యార్థినులు చదువుతున్నారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. దీనితో అధికారులు సెలవు ప్రకటించి విద్యార్థినులను వారి ఇళ్లకు పంపారు.
అంబులెన్సు రాలేక.. మంచంలో
భారీ వర్షంతో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట వెళ్లే దారిలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. గ్రామానికి చెందిన వడ్లకొండ పరమేశ్వర్‌కు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చింది. అంబులెన్సు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను మంచంపై మోసుకుంటూ రైల్వే ట్రాక్ దాటివచ్చి అంబులెన్సులో ఎక్కించారు.
ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఇవ్వండి
కంపెనీలు, ప్రభుత్వానికి హైడ్రా సూచన
2 రోజులు వాహనాలు బయటికి తీయొద్దని పిలుపు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం కల్పించాలని కంపెనీలను, ప్రభుత్వాన్ని కోరారు. వరద నీరు, ఇతర కారణాలతో ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రజలు వీలైనంత వరకు రెండు రోజుల పాటు వాహనాలు బయటికి తీయవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డీఆర్‌ఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు 040-29560521, 90001 13667, 91541 70992, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040 - 21111111కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News