Share News

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:07 PM

సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..
Central Government Warns WhatsApp Web Data Leak Risks

వాట్సాప్ మెసెంజర్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ విస్తృతంగా ఉపయోగిస్తున్న కమ్యూనికేషన్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ వెబ్ రాకతో వ్యాపార రంగంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారతదేశంలో రోజూ కోట్లాది మంది ప్రజలు వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకుని రోజువారీ కార్యకలాపాల కోసం వాడుతున్నారు. అయితే, వాట్సాప్ వెబ్‌ ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కొన్ని భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ ఉపయోగిస్తుంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.


భారత ప్రభుత్వం కార్యాలయాల్లో పనిచేసే వారికి ఒక ముఖ్యమైన సైబర్ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ టీం (ISEA) కార్యాలయ ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లలో WhatsApp వెబ్‌ను ఉపయోగించకుండా ఉండాలని ప్రజలకు సూచించింది. WhatsApp వెబ్ డేటా లీకేజీకి గురయ్యే అవకాశం ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆఫీసు పరికరాల్లో వాట్సాప్ వెబ్‌ ఉపయోగించడం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాకుండా ముఖ్యమైన కంపెనీ సమాచారం కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ మానిటరింగ్, మాల్వేర్, బ్రౌజర్ హైజాకింగ్ వంటి భద్రతా బెదిరింపులు వాట్సాప్ వెబ్ యూజర్లు ఎదుర్కొనే అవకాశముంది.


ఆఫీస్ పరికరంలో వాట్సాప్ వెబ్‌ వాడటం వల్ల మీ పర్సనల్ చాట్, ఫైల్స్, ఇతర సున్నితమైన సమాచారం మీ యజమాని లేదా ఐటీ బృందానికి బహిర్గతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది మీ గోప్యతకు మాత్రమే కాకుండా కంపెనీ డేటా భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది. మీరు ఆఫీస్ వై-ఫై ఉపయోగించినప్పుడు మీ కంపెనీ మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతుంది. అదనంగా, వాట్సాప్ వెబ్‌ ఉపయోగించే పరికరాలు పోయినట్లయితే భారీ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది.


ఈ రోజుల్లో సైబర్ దాడులు, డేటా చోరీ, ఫిషింగ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దీని కారణంగా అనేక సంస్థలు వాట్సాప్ వెబ్‌ను మాల్వేర్, హ్యాకింగ్‌కు సులభమైన మార్గంగా చూస్తున్నాయి. నెట్‌వర్క్ ఉల్లంఘించిన తర్వాత మొత్తం వ్యవస్థ భద్రత ప్రమాదంలో పడవచ్చు. మీరు మీ ఆఫీసు ల్యాప్‌టాప్ లేదా పీసీలో వాట్సాప్ వెబ్‌ ఉపయోగించాల్సి వస్తే ఈ చిట్కాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.


ముందుజాగ్రత్తలు

  • మీ డెస్క్ నుండి బయటకు వెళ్ళే ముందు ఎల్లప్పుడూ WhatsApp వెబ్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.

  • తెలియని నంబర్ నుండి వచ్చిన ఏదైనా లింక్ లేదా ఫైల్‌ను తనిఖీ చేయకుండా తెరవవద్దు.

  • కంపెనీ భద్రతా ప్రమాణాలను పాటించడం ముఖ్యం. సిస్టమ్‌లో అప్ డేట్ చేసిన యాంటీవైరస్, భద్రతా సాధనాలను ఉపయోగించండి.


ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..

మీ ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే ఇలా చేయండి..

Read Latest and Technology News

Updated Date - Aug 27 , 2025 | 03:08 PM