Share News

T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:38 PM

టీమిండియా మహిళా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటర్లలో సౌతాఫ్రికా కెప్టె్న్ లారా వోల్వార్ట్.. మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలిసారిగా ఐసీసీ టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి అగ్రస్థానంలో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో దీప్తి చేసిన అద్భుత ప్రదర్శన ఆమె(Deepti Sharma)ను అగ్రస్థానానికి చేర్చింది.


విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన దీప్తి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదు రేటింగ్ పాయింట్లు సంపాదించింది. దీంతో ఆస్ట్రేలియా బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం దీప్తి కేవలం ఒక పాయింట్ తేడాతో టాప్‌లో కొనసాగుతోంది. ఆగస్టు నుంచి నంబర్‌వన్‌గా ఉన్న సదర్లాండ్ తాజాగా రెండో స్థానానికి పరిమితమైంది.


బ్యాటింగ్‌లో లారా..

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(Laura Wolvaardt) మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించిన వోల్వార్ట్, కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌తో స్మృతి మంధానను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను పదిలపర్చుకుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.


మన అమ్మాయిల హవా!

భారత మహిళా జట్టులో మంచి పురోగతి కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన అరుంధతి రెడ్డి ఐదు స్థానాలు ఎగబాకి టీ20 బౌలర్లలో 36వ స్థానానికి చేరింది. బ్యాటర్ల విభాగంలో జెమిమా రోడ్రిగ్స్ ఐదు స్థానాలు మెరుగుపడి 9వ స్థానంలోకి దూసుకొచ్చింది. శ్రీలంకపై అజేయ అర్ధ శతకం సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన జెమీ.. టాప్-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం టీ20 బ్యాటర్లలో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి స్మృతి మంధాన (3వ స్థానం), షెఫాలి వర్మ (10వ స్థానం) ఉన్నారు.


ఇవీ చదవండి:

‘చిన్నస్వామి’ నుంచి మ్యాచ్‌లు తరలింపు!

కోహ్లీ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

Updated Date - Dec 23 , 2025 | 04:43 PM