Grede Priyandana: టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:59 PM
అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఏకంగా 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు ఇండోనేషియాకు చెందిన గ్రెడే ప్రియాందన. కంబోడియాతో జరిగిన ఈ మ్యాచులో 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డును సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: నయా రికార్డులను కొల్లగొడుతూ ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు ఇండోనేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఏకంగా 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కంబోడియాతో జరిగిన మ్యాచులో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ప్రియాందన(Grede Priyandana) ఈ ఘనత సాధించడం మరో విశేషం.
బాలి వేదికగా ఇండోనేషియా-కంబోడియా మధ్య మంగళవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండోనేషియా 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన కంబోడియా 15 ఓవర్లకు 106/5 వద్ద పటిష్టంగానే కనిపించింది. దీంతో 16వ ఓవర్‌లో కుడిచేతి వాటం బౌలర్ ప్రియాందనను దించింది ఇండోనేషియా జట్టు. ఈ మ్యాచ్‌లో అతడికి ఇదే తొలి ఓవర్.
మెరుపుల్లాంటి బంతులతో కంబోడియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ప్రియాందన. తొలి మూడు బంతుల్లో ముగ్గురిని పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్ సాధించి.. తర్వాతి బంతిని డాట్ బాల్‌గా మార్చాడు. అనంతరం మిగిలిన రెండు బంతుల్లో మరో ఇద్దరిని ఔట్ చేయడంతో కంబోడియా పోరాటం ముగిసింది. ఈ ఓవర్‌లో చివరి రెండు వికెట్ల మధ్య వైడ్ రూపంలో కంబోడియాకు ఒక పరుగు దక్కింది. 107 పరుగులకు ఆలౌట్ అయిన కంబోడియా జట్టు.. 60 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.
ఇదే మ్యాచ్‌లో ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ప్రియాందన.. 11 బంతుల్లో 6 పరుగులు చేశాడు. కానీ, బంతితో మాత్రం అదరగొట్టి.. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సృష్టించాడు. గతంలో ఇలాంటి ఫీట్ దేశవాళీ టీ20ల్లో రెండుసార్లు నమోదైంది. 2013-14లో విక్టరీ డే టీ20 కప్‌లో భాగంగా యూసీబీ-బీసీబీ ఎలెవన్ జట్టు తరఫున బంగ్లాదేశ్ ఆటగాడు అల్ అమీన్ హొస్సేన్ ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీశాడు. ఇక, 2019-20లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో కర్ణాటక ఆటగాడు అభిమన్యు మిథున్ హరియాణాపై ఈ ఘనత సాధించాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ప్రియాందనదే తొలి రికార్డ్. అయితే, ఇప్పటివరకు 14 సార్లు ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి.
ఇవీ చదవండి:
‘చిన్నస్వామి’ నుంచి మ్యాచ్‌లు తరలింపు!
కోహ్లీ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!