Richa Ghosh: జనాలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు.. వరల్డ్ కప్ విజయంపై రిచా ఘోష్
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:06 PM
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్ అనంతరం ఆమె వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ హర్మన్ సేన సౌతాఫ్రికాపై గెలిచి కప్పును ముద్దాడిన క్షణాలు ఇప్పటికీ ప్రతి అభిమాని కళ్ల ముందు మెదులుతున్నాయి. ఆ మెగా టోర్నీ తర్వాత మన అమ్మాయిలు ప్రస్తుతం శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతున్నారు. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అయిదు టీ20ల సిరీస్‌లో భారతజట్టు 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. వీటిలో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లున్నాయి. టీమిండియా రికార్డు స్థాయిలో నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం ఆమె(Richa Ghosh) వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
‘ప్రపంచ కప్ విజయం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేం ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మాకు ఘన స్వాగతాలు లభించాయి. ప్రస్తుతం జట్టులోని సభ్యుల అందరి పేర్లూ జనాలకు తెలుస్తున్నాయి. దీప్తి శర్మ ఎవరు? రిచా ఘోష్ ఎవరు? షెఫాలీ వర్మ ఎవరు? అని వారు గుర్తు పడుతున్నారు. ఇదంతా వరల్డ్ కప్ విజయం వల్లే సాధ్యమైంది’ అని రిచా వెల్లడించింది.
ఆత్మవిశ్వాసం పెరిగింది..
‘వరల్డ్ కప్ విజయం తర్వాత మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే తర్వాత సిరీస్‌లో రాణించడానికి ఉపయోగపడుతుంది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ ఆటలో అది కనిపిస్తోంది. నాకు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు.. ఎక్కువ పరుగులు సాధించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలపాలనే ఆశయంతో ముందుకు సాగాను. అలాగే పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించింది. బంతి సైతం బ్యాట్ మీదకు చక్కగా వచ్చింది. స్లో బంతులు కూడా ఆడటంలో ఇబ్బంది ఎదురు కాలేదు. షాట్ సెలక్షన్ అనేది కీలకం. మేమంతా దాన్ని చేసి చూపించాం. అందుకే భారీ పరుగులు రాబట్టగలిగాం’ అని వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?