Doug Bracewell: రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:20 AM
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 నుంచి 2023 వరకు బ్లాక్‌క్యాప్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు.. కేవలం 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26 వికెట్లు, టీ20ల్లో 20 వికెట్లు సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఐసీసీ వెబ్‌సైట్ సోమవారం వెల్లడించింది. 35 ఏళ్ల బ్రేస్‌వెల్ 2011 నుంచి 2023 వరకు బ్లాక్‌క్యాప్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో బ్రేస్‌వెల్ 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26 వికెట్లు, టీ20ల్లో 20 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లోనూ కీలకంగా నిలిచిన అతడు(Doug Bracewell) టెస్టుల్లో 568, వన్డేల్లో 221, టీ20ల్లో 126 పరుగులు చేశాడు.
బ్రేస్‌వెల్ చివరిసారిగా 2023లో వెల్లింగ్టన్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున ఆడాడు. ఇటీవల రిబ్ గాయం బారిన పడి దేశవాళీ జట్టు తరఫున కూడా ఇకపై ఆడలేనని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బ్రేస్‌వెల్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించింది. 2011లో హోబార్ట్ వేదికగా ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ సాధించిన చారిత్రక టెస్ట్ విజయంలో బ్రేస్‌వెల్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 6 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 7 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
తన కెరీర్‌పై బ్రేస్‌వెల్ స్పందించాడు. ‘క్రికెట్ నా జీవితంలో గర్వించదగ్గ ఓ భాగం. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం అనేది నా కల. న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. ఫస్ట్‌క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఒక గౌరవం. ఇన్ని సంవత్సరాలు ఆటను ఆస్వాదించినందుకు కృతజ్ఞుడిని’ అని బ్రేస్‌వెల్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!
ఏ పదాన్ని తీసేస్తారో చూడాలి.. మెల్‌బోర్న్ పిచ్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు