Share News

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:51 PM

ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: 2025 ముగింపు దశకు వచ్చేసింది. మరో రోజులో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నాం. మరి ఈ ఏడాదిలో బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్లు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా. అలాంటి క్రికెట్ అభిమానుల కోసమే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తన దృష్టిలో బౌలర్, బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరో చెప్పేశాడు.


‘నా దృష్టిలో వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) టీమిండియాకు బౌలర్ ఆఫ్ ది ఇయర్. అతడు జట్టుకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 సాధించడంలో వరుణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ముఖ్యంగా అతడు టీ20 స్పెషలిస్ట్ బౌలర్. అతడు జట్టులో చోటు కోల్పోయినప్పుడు పుంజుకొని కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు. నిజానికి అతడో ఆర్కిటెక్ట్‌. క్రికెట్‌ అతడి మొదటి ప్రొఫెషన్‌ కాదు. అతడు మొదట చెన్నైలో ఐదో డివిజన్‌లో బౌలింగ్‌ చేశాడు. తర్వాత నెట్‌ బౌలర్‌గా వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుతంగా బంతులు సంధించాడు’ అని అతడి క్రికెట్ ప్రయాణాన్ని అశ్విన్‌ గుర్తు చేశాడు.


బ్యాటర్ ఎవరంటే..?

‘టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్ అభిషేక్ శర్మ. 2025లో అతడు(Abhishek Sharma) బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో చక్కగా పరుగులు రాబట్టాడు. అతడిని వన్డే ఫార్మాట్‌లో కూడా చూడాలని ఉంది. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతడిని పరీక్షించొచ్చు. అతడు ఈ సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ బ్యాటర్’ అని అశ్విన్ వెల్లడించాడు.


అలాగే రో-కో జోడీ గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. ‘వారు రానున్న వన్డే వరల్డ్‌ కప్‌ గెలవాలన్న ఆశయంతో ఉన్నారు. దాన్ని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వారి ఆటను మనమంతా ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నాడు. వరుణ్‌ చక్రవర్తి ఇప్పటివరకు ఆడిన నాలుగు వన్డేల్లో 10, 20 టీ20ల్లో 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక.. అభిషేక్‌ శర్మ 2025లో 21 టీ20 మ్యాచుల్లో 42.95 యావరేజ్‌, 193.46 స్ట్రైక్‌ రేట్‌తో 859 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, అయిదు హాఫ్‌ సెంచరీలున్నాయి.


ఇవీ చదవండి:

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో.. స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుందా?

హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప

Updated Date - Dec 30 , 2025 | 03:51 PM