Smriti Mandhana: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో.. స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుందా?
ABN , Publish Date - Dec 30 , 2025 | 02:55 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ రికార్డుకు అడుగు దూరంలో ఉంది. మరో 62 పరుగులు చేస్తే ఈ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలుస్తుంది. ఈ విషయంలో శుభ్‌మన్ గిల్‌ను కూడా అధిగమించే ఛాన్స్ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డుకు అడుగులో దూరంలో ఉంది. తాజాగా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో స్మృతి మరో 62 పరుగులు చేస్తే 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది. దీంతో పాటు ఈ విషయంలో టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను కూడా అధిగమించే ఛాన్స్ ఉంది. ప్రస్తుత సంవత్సరంలో ఆమె ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 1,703 పరుగులు చేసింది. గిల్ 1,764 పరుగులు చేశాడు. మహిళల క్రికెట్‌లో ఇప్పటికే మంధాన అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.
అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో స్మృతి(Smriti Mandhana) అంతగా రాణించలేదు ఒకవేళ వాటిల్లో మరిన్ని పరుగులు చేసి ఉంటే ఇప్పటికే గిల్(Shubman Gill)ను వెనక్కి నెట్టి ఉండేది. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన నాలుగో టీ20లో మాత్రం 48 బంతుల్లోనే 80 పరుగులు పూర్తి చేసింది. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే అయిదో టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్మృతిమంధాన ఈ మ్యాచ్‌లోనూ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే.. రికార్డ్ సృష్టించే అవకాశముంది.
స్మృతి మంధాన ఇప్పటివరకు తన కెరీర్‌లో 7 టెస్ట్ మ్యాచుల్లో 57.18 యావరేజ్‌తో 629 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అలాగే 117 వన్డేల్లో 48.38 యావరేజ్‌తో 5,322 పరుగులు సాధించింది. అందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం ఆమె ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్లలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అలాగే 157 టీ20ల్లో 4,102 పరుగులు చేసింది.
ఇవీ చదవండి: