Hardik Pandya: హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప
ABN , Publish Date - Dec 30 , 2025 | 02:33 PM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్‌లో రీఎంట్రీపై మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆడతానంటే బీసీసీఐ హార్దిక్ పాండ్యకు అడ్డు చెప్పదని వెల్లడించాడు. తుది నిర్ణయం అతడిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో సూపర్ నాక్ ఆడి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. హార్దిక్ పాండ్య(Hardik Pandya)పై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ టెస్టుల్లోకి పునరాగమనం చేస్తే అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
‘ఒకవేళ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేస్తే.. 7వ స్థానంలో చక్కగా సరిపోతాడు. ప్రస్తుతం అతడు ఆడుతున్న విధానాన్ని చూస్తే ఏదైనా జరగొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది క్రికెట్. హార్దిక్ పాండ్య టెస్ట్ క్రికెట్ ఆడాలని నిశ్చయించుకుంటే.. బీసీసీఐ(BCCI) వద్దు అంటుందా? ‘నేను ఆడతాను.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను సాధిస్తాను’ అని హార్దిక్ అంటే బీసీసీఐ నో చెబుతుందనైతే నేను అనుకోను’ అని రాబిన్ ఉతప్ప విశ్లేషించాడు.
నిర్ణయం అతడిదే..
‘ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల మీద అంత ఒత్తిడి లేదు. ఆల్‌రౌండర్లు 20 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నారా? నితీశ్ కుమార్ రెడ్డి అయితే 12 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతమున్న ఫిట్‌నెస్ ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్య ఒక ఇన్నింగ్స్‌లో 12 నుంచి 15 ఓవర్లపాటు బౌలింగ్ వేయగలడు. అయితే ఈ విషయమై అతడే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని రాబిన్ ఉతప్ప అన్నాడు. హార్ది్క్ పాండ్య చివరిసారిగా 2018లో టెస్ట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. వెన్నుముక గాయం తర్వాత అతడు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అప్పటి నుంచి పాండ్య కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
ఇవీ చదవండి: