Share News

Magnus Carlsen: బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ చేతిలో ఓడిన కార్ల్‌సన్.. ఆ కోపంతో...

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:42 PM

ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి నియంత్రణ కోల్పోయాడు. బ్లిట్జ్ ఛాంపియన్ షిప్‌లో అర్జున్ ఇరిగేశితో ఓటమి అనంతరం.. పిడికిలితో బల్లను గుద్ది అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Magnus Carlsen: బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ చేతిలో ఓడిన కార్ల్‌సన్.. ఆ కోపంతో...
Magnus Carlsen Slams Table

ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దోహాలో జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‌(World Blitz Championship)లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి(Arjun Erigaisi) చేతిలో ఓటమి అనంతరం.. తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక తన పిడికిలితో బోర్డును బలంగా గుద్దాడీ(Magnus Carlsen Slams Table) ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్. ఆ తర్వాత అర్జున్‌తో కరచాలనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కార్ల్‌సన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.


కాగా.. అర్జున్‌తో గేమ్‌కు ముందు మరో క్రీడాకారుడితో ఆడే క్రమంలోనూ కార్ల్‌సన్ ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆ గేమ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే.. గతంలో గుకేశ్‌‌(Gukesh)తో పరాభవం అనంతరం ఇదే తరహాలో అసహనానికి గురై టేబుల్‌ను బలంగా గుద్ది అతడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.


అగ్రస్థానంలో అర్జున్

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో కాంస్యం గెలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి.. బ్లిట్జ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. 13 రౌండ్లు ముగిసేసరికి 10 పాయింట్లతో వాచీర్‌ లాగ్రేవ్‌(Vachier Lagrave), ఫాబినో కరువానా(Fabiano Caruana)తో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 8 గేముల్లో గెలిచిన అర్జున్‌.. నాలుగింటిని డ్రాగా ముగించి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ఈ క్రమంలో అర్జున్‌ తన తొమ్మిదో రౌండ్లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌(నార్వే)ను ఓడించడం విశేషం. అంతకముందు కరువానా చేతిలోనూ ఓడిన కార్ల్‌సన్‌.. ప్రస్తుతం 9 పాయింట్లతో కొనసాగుతున్నాడు.


ఇవీ చదవండి:

ఒకే ఒక్కడు 8 వికెట్లు

ఘనంగా ముగించాలని

Updated Date - Dec 30 , 2025 | 12:56 PM