Minister Nara Lokesh: నా తల్లిని అవమానించిన వారిని వదలం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:40 AM
ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఏ పార్టీలో ఉన్నా మహిళలను కించపరిస్తే సహించేది లేదని, తన తల్లిని అవమానించిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) హెచ్చరించారు. ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటరులో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పండితుల ఆశీర్వచనం చేశారు. అనంతరం ప్రసంగించారు మంత్రి నారా లోకేశ్.

మీరంతా ఎన్నారైలు కాదని.. ఎమ్మారైలు (మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్) అంటూ లోకేశ్ చేసిన ప్రసంగానికి ప్రవాసుల హర్షాతిరేకాలు మిన్నంటాయి. ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన ప్రవాసుల కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.

తాను వాషింగ్‌టన్ డీసీలో ప్రపంచబ్యాంకులో పనిచేశానని, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్నానని, ఒక ఎన్నారైగా ఉండే సాధకబాధలు తనకు తెలుసునని ప్రస్తావించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రవాసాంధ్రులకు కష్టకాలం నడుస్తోందని, ఎదురుదెబ్బలకు తలొగ్గకుండా ముందుకు నడవాలని సూచించారు. మంగళగిరిలో మొదటిసారి ఓడిపోయిన తాను కసితో పట్టుదలగా పనిచేసి ఆ తర్వాత గెలిచానని గుర్తు చేశారు మంత్రి నారా లోకేశ్.

ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం కంప్యూటింగ్ సమావేశానికి పిలిచినప్పుడు తనకు దాని గురించి ఒక్క ముక్క తెలియకపోతే చాట్ జీపీటీ వాడి తెలుసుకున్నానని ప్రస్తావించారు. 75 ఏళ్ల వయస్సులో సీఎం చంద్రబాబు స్పీడు చూసి అందరిలాగా తాను కూడా దాన్ని అందుకునేందుకు కష్టపడుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం తాను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటిస్తున్నానని, 20లక్షల ఉద్యోగాల కల్పనలో తాము ముందు వరుసలో ఉన్నామని వివరించారు. ఎక్కడైనా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది గానీ ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని వ్యాఖ్యానించారు. స్పీడుకి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అని పునరుద్ఘాటించారు మంత్రి నారా లోకేశ్.

ప్రతి జిల్లాలో కూటమి గెలుపొందిన స్థానాలు ప్రకటించే ముందు ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రవాసాంధ్రులు చేతులు ఎత్తాలని లోకేశ్ కోరారు. కృష్ణా - గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల పోటాపోటీ నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ప్రకాశం జిల్లాను పిలవలేదని సభికులు సూచించగా, విశాఖపట్నం - ప్రకాశం జిల్లాలు తెలుగుదేశం గౌరవాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని ప్రశంసించారు మంత్రి నారా లోకేశ్.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నట్లు కూటమి ప్రభుత్వం మరో 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలని సూచించారు. అధికార మార్పిడి లేకుండా ఒకే ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగితే గుజరాత్ లాగా ఏపీ కూడా సుస్థిరాభివృద్ధిలో దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. ఏపీఎన్ఆర్‌టీ ద్వారా విద్యార్థులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా కల్పించారు.

నిర్వాహకులు ఆశించినంత మేర అతిథులు హాజరు కానప్పటికీ వచ్చినవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేశ్ ప్రసంగిస్తుండగా హాజరైన కార్యకర్తలు తోట చంద్రయ్య, ఎర్రబుగ్గ, అంజిరెడ్డి వంటి వారి గురించి సూచించగా తనకన్నా అతిథులే చాలా ఫాస్ట్‌గా ఉన్నారని నవ్వులు పూయించారు మంత్రి నారా లోకేశ్.

గార్లాండ్ మేయర్ డిలన్ హెడ్రిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబరు 6వ తేదీని గార్లాండ్ నగరంలో నారా లోకేశ్ దినోత్సవంగా ప్రకటించారు. ఎన్నారై తెలుగుదేశం సమన్వయకర్త కోమటి జయరాం, డా. వేమూరు రవికుమార్‌లు ప్రసంగిస్తూ లోకేశ్ వంటి యువనాయకత్వం రాష్ట్రానికి అవసరమని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌కు హైటెక్ సిటీకి తీసుకుని వస్తే లోకేశ్ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటరును తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు టీడీపీ జెండాలతో సందడి చేశారు.
1960ల నుంచి అమెరికాకు వలస వచ్చిన తెలుగువారు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు సంక్షేమాన్ని చూశారని, ఆ తర్వాత వచ్చిన వారు సంక్షేమానికి చంద్రబాబు జోడించిన సాంకేతికతను చూశారని తెలిపారు. ప్రస్తుతం తరం అందరం కలిసి ఆయా తరాలు నిర్మించిన గౌరవాన్ని కాపాడాలని, దాన్ని తదుపరి తరాలకు అందించాలని కోరారు మంత్రి నారా లోకేశ్.
లోకేశ్ బస చేసిన వెస్టిన్ హోటల్ వద్ద జనసేన, బీజేపీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం లోకేశ్ అంటూ ఒక అభిమాని చేసిన నినాదానికి స్పందిస్తూ అలా అంటూ తన ప్రస్తుత ఉద్యోగాన్ని ఊడగొట్టకండి అని లోకేశ్ సరదాగా అన్నారు. అందరికీ బాలయ్య గానీ తనకు ముద్దుల మావయ్య అని తన ప్రసంగం జై బాలయ్య, జైహింద్‌లతో లోకేశ్ ముగించారు. శనివారం రాత్రి ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు పయనమయ్యారు. సోమ, మంగళవారాల్లో అధికారిక పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించే సమావేశాల్లో పాల్గొంటారు. కెనడాలోని టోరొంటోలో కూడా కీలక సదస్సులో పాల్గొననున్నారు మంత్రి నారా లోకేశ్.
ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుంచే గాక కెనడా నుంచి కూడా ప్రవాసాంధ్రులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మండువ సురేశ్, మండువ సతీశ్, జాస్తి శివ, రామ్ యలమంచిలి, కేసీ చేకూరి, కొణిదెల లోకేశ్ నాయుడు, దిలీప్ చండ్ర, జాస్తి శ్రీతేజ, సాయి మద్దిరాల, పురుషోత్తమచౌదరి గుదె, సాయి బొల్లినేని, ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, సుమంత్ పుసులూరి, సూర్య బెజవాడ, గొర్రెపాటి చందు, రామ్ గుళ్లపల్లి, బొర్రా విజయ్, రాజా సూరపనేని, రఘు యెద్దులపల్లి, సుగణ్ చాగర్లమూడి, శ్రీనాథ్ రావుల, వినోద్ ఉప్పు, దొడ్డా సాంబా, యాష్ బొద్దులూరి, కిషోర్ చలసాని, దినేష్ త్రిపురనేని, సతీశ్ కొమ్మన తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన
ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి