Yogi Adityanath: నేపాల్ గొడవల్లో యూపీ సీఎం.. సడన్‌గా ట్రెండ్ అవుతున్న యోగి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:03 PM
Yogi Adityanath Nepal: పొరుగు దేశం నేపాల్‌లో ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల సీఎంలు ఉండగా కేవలం యోగి పేరే ట్రెండింగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..

Yogi Adityanath Nepal: పొరుగు దేశమైన నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది మంది వచ్చి ఉత్తరప్రదేశ్ సీఎం చిత్రం ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. రాచరిక అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో .. రాచరిక పాలనకు కావాలని కోరుతూ వేలాదిమంది రాజుతో పాటు యోగి చిత్రాన్ని ప్రదర్శిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు నేపాల్లో చర్చనీయాంశంగా మారింది.
ర్యాలీలో యూపీ సీఎం పోస్టర్లు అందుకే..
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు వీధుల్లో వేలాది మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాచరిక పాలన, హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను కూడా ప్రదర్శించారు. అయితే, నేపాల్ రాజకీయాలకూ, యూపీ సీఎంకూ ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా.. నేపాల్‌ను మళ్ళీ హిందూ దేశంగా మార్చాలని జ్ఞానేంద్ర షా చాలా కాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌ను సందర్శించిన సమయంలో యూపీ సీఎంతో భేటీ అయ్యి ప్రత్యేకంగా ముచ్చటించారు. దీని తర్వాత రాచరిక పాలనకు యోగి తన పూర్తి మద్ధతు ప్రకటించారు.
రాచరిక పాలన కోసం ర్యాలీ.
నేపాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి హిందూ రాచరికానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 2006లో చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం రాజు జ్ఞానేంద్ర పాలనకు ముగింపు పలికింది. అప్పటి నుంచి నేపాల్‌లో వామపక్షాలు పాలిస్తూ వస్తున్నాయి. పుష్పకమల్ దహల్ ప్రచండ తర్వాత కే.పీ.శర్మ ఓలి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అయితే, తాజాగా రాచరికం తిరిగి రావాలని కోరుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఇటీవల మాజీ రాజు జ్ఞానేంద్ర షా పోఖారా నుండి ఖాట్మండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటకు రాగానే షా మద్దతుదారులు అక్కడ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ర్యాలీలోనే కొంతమంది యువకులు రాజా జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్, జాతీయ జెండా పోస్టర్లను చేత పట్టి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. ఇదిలా ఉంటే, యూపీ సీఎం యోగి ఫోటో ర్యాలీలో ప్రదర్శించడాన్ని ప్రధాన మంత్రి కేపీ ఓలి తప్పుపట్టారు.
Read Also : Yogi Adityanath: ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది
CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..
Nityanand Rai: ‘హద్దు’ మీరితే ఐదేళ్ల జైలు