Share News

Nityanand Rai: ‘హద్దు’ మీరితే ఐదేళ్ల జైలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:47 AM

వలస విధానం సహా విదేశీయుల రాక, పోక, బసకు సంబంధించిన కీలక బిల్లును కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫార్నర్స్‌ బిల్‌-2025’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సభలో ప్రవేశ పెట్టారు.

Nityanand Rai: ‘హద్దు’ మీరితే ఐదేళ్ల జైలు

పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి ప్రవేశిస్తే రూ.5 లక్షల జరిమానా కూడా

  • లోక్‌సభలో వలస, విదేశీయుల బిల్లు

  • ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానంద్‌

న్యూఢిల్లీ, మార్చి 11: వలస విధానం సహా విదేశీయుల రాక, పోక, బసకు సంబంధించిన కీలక బిల్లును కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫార్నర్స్‌ బిల్‌-2025’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ద్వారా వలస విధానంలోని వివిధ సేవలను క్రమబద్ధీకరించనున్నారు. అదేవిధంగా విదేశీయులు భారత్‌లోకి రావడం, వెళ్లడం సహా నివాసం, వారి పర్యటనలు వంటి అన్ని వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. విదేశీయులపై పూర్తి నియంత్రణ కేంద్రానికే ఉంటుంది. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలను నిత్యానందరాయ్‌ తోసిపుచ్చారు. వలస విధానం సహా, విదేశీయులకు సంబంధించిన అంశాలపై చట్టం చేసే సంపూర్ణ హక్కు కేంద్రానికి ఉందన్నారు. రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ పర్యాటకులను స్వాగతిస్తామని, అదేసమయంలో దేశ శాంతి, సౌభ్రాతృత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నొక్కి చెప్పారు. బిల్లును ప్రవేశ పెడుతున్న సమయంలోనే అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ.. పాలక పక్ష భావజాలాన్ని అంగీకరించని విదేశీయులను దేశంలోకి అడుగుపెట్టకుండా చేయాలన్న ఉద్దేశం ప్రతిపాదిత బిల్లులో కనిపిస్తోందన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన విదేశీయులను దేశంలోకి అడుగుపెట్టకుండా చేసేలా ఈ బిల్లు ఉందని టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌ అన్నారు. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లోపాలను ఈ బిల్లు సరిచేస్తుందని, నకిలీల బెడదను తప్పించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ప్రస్తుతం 1939 నాటి విదేశీయుల రిజిస్ట్రేషన్‌ చట్టం, 1946 నాటి విదేశీయుల చట్టం అమల్లో ఉన్నాయి. వీటి ఆధారంగానే బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏడు విభాగాలుగా వీసాలను వర్గీకరించి 167 దేశాల ప్రజలకు వీసాలను మంజూరు చేస్తోంది. అదేవిధంగా జపాన్‌, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల ప్రజలకు ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో ‘వీసా ఆన్‌ అరైవల్‌’ విధానాన్ని కొనసాగిస్తోంది.


తాజా బిల్లులో ఏముంది?

  • విదేశీయుల లీగల్‌ స్టేటస్‌ అంశం ఇకపై ప్రభుత్వంపై ఉండదు. వారే బాధ్యత వహించాలి.

  • దేశ భద్రతకు, సౌభ్రాతృత్వానికి భంగం వాటిల్లుతుందని సందేహిస్తే.. సదరు వ్యక్తులను దేశంలోకి ప్రవేశించకుండా ఈ బిల్లు అడ్డుకుంటుంది.

  • నకిలీ పత్రాలతో పాస్‌ పోర్టు పొందే వారికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతోపాటు రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

  • ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ఈ బిల్లు విస్తృత అధికారాలను కల్పిస్తోంది. తద్వారా ఎలాంటి వారెంటు లేకుండానే వారు విదేశీ వ్యక్తులను అరెస్టు చేసే అధికారం లభిస్తుంది.


పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

పీఎం కిసాన్‌ పథకంలో ఇప్పటిదాకా చేరని రైతులు.. ఇప్పుడు పథకంలో చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక, క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో 200 డే క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా రాజ్యసభలో వెల్లడించారు.


డీలిమిటేషన్‌తో 9 రాష్ట్రాలకు నష్టం: కాంగ్రెస్‌

కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాల పాలిట లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) శాపంగా పరిణమించనుందని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ మంగళవారం ‘ఎక్స్‌’లో ఈ మేరకు భారీ పోస్టును ఉంచారు. 2026లో జనాభా అంచనా ఆధారంగా డీలిమిటేషన్‌ చేస్తే తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ 8 సీట్లు చొప్పున కోల్పోనున్నాయని తెలిపారు. అలాగే, పశ్చిమబెంగాల్‌(4), ఒడిసా(3), కర్ణాటక(2), హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ ఒక్కో సీటు కోల్పోతాయన్నారు. ఇక యూపీకి 11, బిహార్‌కు 10, రాజస్థాన్‌కు 6, మధ్యప్రదేశ్‌కు 4 సీట్లు పెరుగుతాయని తెలిపారు. జార్ఖండ్‌, హరియాణా, గుజరాత్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు ఒక్కో సీటు పెరగనున్నట్టు వివరించారు. అసోం, జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్రలో సీట్ల సంఖ్యలో మార్పు ఉండదన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:47 AM