Share News

Supreme Court: వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:07 PM

మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Supreme Court Acts on North India Floods and Illegal Deforestation

ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రకృతి విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. కొండప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరికేయడం (Illegal Tree Felling) వల్లే ఇంతటి స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల వల్ల పెద్ద సంఖ్యలో కలప దుంగలు కొట్టుకుపోతున్న వీడియోలను ప్రస్తావిస్తూ.. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.


కొండ ప్రాంతాల్లో పర్యావరణ క్షీణతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తరభారతంలో నమోదవుతున్న వరస విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ ఇలా వ్యాఖ్యానించారు, 'ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు మనం చూశాం. మీడియాలో వస్తున్న అనేక కథనాలు, వీడియోల్లో వరద నీటి ప్రవాహంతో పాటుగా పెద్ద ఎత్తున్న కలపదుంగలు కొట్టుకొచ్చాయి. ఆ ప్రాంతాల్లో చెట్లను విస్తృతంగా నరికివేయడం వల్లే ఇదంతా జరిగినట్లు కనిపిస్తోందని' అన్నారు.


ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు దీనిని తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా, వరద నీటిలో తేలుతున్న చెట్ల దుంగల వీడియోలను పరిశీలించి మూలకారణాలపై నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Updated Date - Sep 04 , 2025 | 07:03 PM