Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:34 PM
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 04: సుగాలి ప్రీతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని ఆ సంస్థ డైరెక్టర్‌కు లేఖ రాయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రోజే సీబీఐకి ఆ లేఖ రాయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా విషయంలో మన వద్ద నిల్వలు ఉండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేక పోతున్నామన్నారు.
ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నారని పేర్కొన్నారు. మన వద్ద యూరియా ఉంది.. కానీ ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి.. దానిని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా అడ్మిన్‌కు బాధ్యత ఉండే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. యూరియా పంపిణిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు. ఇది మనందరి బాధ్యతగా పరిగణించాలని సూచించారు.
కుప్పంలోని కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేశారన్నారు. కానీ అది నిజం కాదని చెప్పారు. ఇది జనం నమ్మే వరకు వెళ్లనివ్వకూడదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలిపారు. మనం జాగ్రత్తగా ఉంటే.. ఇటువంటి అసత్య ప్రచారాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయొచ్చన్నారు.
భవనాల క్రమబద్ధీకరణ విషయంలో ఇక ముందు జాగ్రత్త వహించాలన్నారు. ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసి భవనాలు క్రమబద్ధీకరణ చేయమని అడిగితే ఎలా అని సీఎం చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమం సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంపై మంత్రులతో కమిటీని పార్టీ హైకమాండ్ వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విలేజ్ మార్ట్‌లు రద్దు చేయాలంటూ ఈ కేబినెట్ సమావేశానికి ముందు విద్యా , ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
2017, ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి మృతి చెందింది. కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. దీంతో సుగాలీ ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. దాంతో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని కూటమి నేతలు గతంలో ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రీతి కేసును మరోసారి సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు
Read Latest Andhra Pradesh News and National News