PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:05 PM
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మణిపూర్‌తోపాటు మిజోరం (Mizoram), అసోం (Assam), పశ్చిమబెంగాల్(West Bengal), బిహార్ (Bihar)లలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఆయన పర్యటిస్తారని, రూ.71,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మణిపూర్‌లోని చౌరాచాంద్‌పూర్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు రూ.7,300 కోట్లు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంఫాల్‌లో రూ.1.200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు అసోంలో పర్యటించి గౌహతిలో జరిగే భారతరత్న భూపెన్ హజారికా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడతారు.
కాగా, 14వ తేదీ ఆదివారం నాడు అసోంలో పర్యటిస్తారు. రూ.18,530 కోట్లు విలువైన కీలకమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 11 గంటలకు దరంగ్ జిల్లాలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు గోలఘాట్ వద్ద అసోం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. పాలీప్రొఫైలిన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు.
ఈనెల 15వ తేదీన పశ్చిమబెంగాల్‌లో ప్రధాని పర్యటించి ఉదయం 9.30 గంటలకు కోల్‌కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025లో పాల్గొంటారు. అనంతరం బిహార్ వెళ్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభిస్తారు. పూర్ణియాలో రూ.36,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి ప్రసంగిస్తారు. బిహార్‌లో నేషనల్ మఖానా బోర్డును కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
For More National News and Telugu News