Share News

Priyank Kharge: గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే

ABN , Publish Date - Oct 17 , 2025 | 05:53 PM

ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆర్ఎస్ఎస్ తరఫున ఎందుకు మాట్లాతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.

Priyank Kharge: గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge

బెంగళూరు: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) శుక్రవారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి సమావేశాలను నిర్వహించ రాదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


'ముఖ్యమంత్రికి నేను లేఖ రాశాను. దానిని పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి తెస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎలాంటి సమీకరణలకైనా, సమావేశాలకైనా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే లీగల్ చర్యలు తీసుకుంటాం' అని ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


'ఆర్ఎస్ఎస్, బీజేపీల స్థాయీ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఆలోచన.. అంతిమంగా మహాత్మాగాంధీ మరణానికి, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఓటమికి దారితీసింది. ఇది సమాజాన్ని అత్యంత విషపూరితం చేసే ఆలోచన. మహాత్మాగాంధీ వంటి గొప్ప వ్యక్తులనే వాళ్లు లెక్కచేయనప్పుడు నేను ఎంత?' అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ప్రియాంక్ ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆర్ఎస్ఎస్ తరఫున ఎందుకు మాట్లాతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. 'ఆర్ఎస్ఎస్ తరఫున మాట్లాడేందుకు వాళ్లు ఎవ్వరు. ఆర్ఎస్ఎస్ తనకు తాను డిఫెండ్ చేసుకోలేదా?' అని ఆయన నిలదీశారు.


ప్రభుత్వ అధికారుల ధిక్కారం..

కాగా, ఆర్ఎస్ఎస్ ఈవెంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారంటూ ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు తటస్థంగా ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక స్టేట్ సివిల్ సర్వీస్ (కాండక్ట్) రూల్స్-2021ను అమలు చేయాలని సీఎంను ఆయన కోరారు. ఇది తాను పెట్టిన రూల్ కాదని, కర్ణాటక సివిల్ సర్వీస్ రూల్ అని, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సంస్థలతో సంబంధం ఉన్న ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని ఆ నిబంధన చెబుతోందని అన్నారు. అయినప్పటికీ పీడీఓలు, విలేజ్ అకౌంటెంట్లు, ఇతర అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఈవెంట్లలో ప్రసంగిస్తున్నారని చెప్పారు.


షోకాజ్ నోటీసులు

కాగా, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖర్గే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. సిద్ధాంతాలు ఉంటే ఉండవచ్చని, కానీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర నిబంధనలను పాటించాల్సిందేనని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు

నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 06:26 PM