Bengaluru Business Corridor: బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:47 AM
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు నగర ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. నగరం చుట్టూ 117 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మించేందుకు బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ను రింగ్ రోడ్డు మీదకు మళ్లించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు వేసిన చారిత్రాత్మక అడుగని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ‘ట్రాఫిక్ రద్దీతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రద్దీని తగ్గించాలని అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్టుతో 1900 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. కానీ వారికి ప్రభుత్వంపై ఉన్న అంచనాల కంటే ఎక్కువగానే పరిహారాన్ని అందిస్తున్నాము. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో ఇదీ ఒకటి’ అని మంత్రి తెలిపారు (Bengaluru Business Corridor)
బెంగళూరు బిజినెస్ కారిడార్ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ 40 శాతం మేర తగ్గుతుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు. హైవేలు, ఇండస్ట్రియల్ జోన్‌ల మీదుగా వెళ్లే వాహనాలు నగరాన్ని బైపాస్ చేసి వెళ్లిపోతాయని తెలిపారు. భూమి ఇచ్చేందుకు ఓనర్లు ఒప్పుకోని పక్షంలో పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి ముందుకెళతామని అన్నారు. ఏ భూమినీ డీనోటిఫై చేయబోమని హామి ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, భూమి వదులుకున్న వారిలో చాలా మంది నగదు పరిహారానికి బదులు మరో చోట భూమి కోరుకోవడంతో ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్ల లోపే ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది (Karnataka Cabinet Approval).
ఇక భూసేకరణ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఐదు రకాల పరిహార ప్యాకేజీలను ప్రకటించింది. అర్బన్ ప్రాంతాల్లోని భూముల గైడెన్స్ వ్యాల్యూకు రెండు రెట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. ఇక నగరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు భూముల గైడెన్స్ వ్యాల్యూకు మూడు రెట్ల పరిహారం చెల్లించనుంది. వీటితో పాటు టీడీఆర్, ఎఫ్ఏఆర్, భూముల బదిలీని కూడా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
బిహార్ ఎన్నికల.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి