Dharmasthala: ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు.. ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:27 PM
ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ప్రధాన సాక్షి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ ప్రాంతంలో 80 మృతదేహాలను తన చేతులతోనే పాతిపెట్టానని చెప్పడంతోపాటు.. ఎలా ఖననం చేశాడో వివరించాడు.
Dharmasthala Mass Burial Case: కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రా క్షేత్రం 'ధర్మస్థల' ఇప్పుడు సంచలన అంశంగా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని.. వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏఏ ప్రాంతాల్లో అతడు మృతదేహాలను పూడ్చాడనే విషయాల ఆధారంగా ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఆశ్చర్యకర నిజాలు వెల్లడించాడు. తాను చెప్పిన 13 ప్రదేశాలలో.. ఒక్కచోటే 70-80 మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేసినట్లు పేర్కొన్నాడు.
నేరుగా ఆలయం నుంచే సూచనలు వచ్చాయని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపిస్తున్నాడు. సూపర్‌వైజర్లు బలవంతం చేయగా.. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎంతోమంది పిల్లలు, మహిళలు, పురుషుల మృతదేహాలను ఖననం చేసినట్లు వెల్లడించాడు. అలాగే, తాను ఎల్లప్పుడూ మృతదేహాలను పాత రోడ్లపై లేదా అటవీ ప్రాంతంలో పాతిపెట్టానని చెబుతున్నాడు. సైట్ నంబర్ 13 వద్ద 70-80 మృతదేహాలను ఖననం చేశానని పేర్కొన్నాడు. కొన్ని శవాలను కొండల్లో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఏ ప్రాంతంలో పాతిపెట్టాలనేది ఆలయానికి సంబంధించిన వ్యక్తులే చెప్పేవారని.. అక్కడే పాతిపెట్టేవాడినని అన్నాడు. అలాగే తాము ఎన్నోమార్లు పగటిపూటే మృతదేహాలను పూడ్చిపెట్టడం స్థానికులు చూశారని.. కానీ ఎవరూ తమని ఆపలేదని, ప్రశ్నించలేదని చెప్పుకొచ్చాడు.
చాలా మృతదేహాలపై లైంగిక వేధింపుల సంకేతాలు స్పష్టంగా కనిపించేవని అతను వెల్లడించాడు. తనతోపాటు మరికొందరు కలిసి బృందంగా ఏర్పడి దాదాపు 100 మృతదేహాలను ఖననం చేయగా.. వాటిలో 90 మహిళలవేనని అంటున్నాడు. అయితే, ఆలయ మేనేజర్ ఒక రూమ్ బాయ్ ద్వారా మృతదేహాల ఖననానికి సంబంధించిన పనులను పురమాయించేవాడని పేర్కొన్నాడు. కాగా, ఇప్పటివరకు ఒకే ఒక్క ప్రదేశంలోనే మానవ అవశేషాలు బయల్పడడానికి గల కారణం.. భూమి కోతకు గురవ్వడం, అడవుల పెరుగుదల, నిర్మాణ పనులే అయి ఉండవచ్చని చెప్పాడు.
ఆలయ ప్రతిష్ఠను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలను మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తీవ్రంగా ఖండించారు. 'ఆలయం పేరును కళంకం చేయడం ద్వారా నాకు ఏమి లభిస్తుంది? నేను షెడ్యూల్డ్ కులానికి చెందిన హిందువును' అని వాపోయాడు. అపరాధ భావనకు గురికావడం వల్లే 10 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు వెల్లడించానని అన్నాడు. అలాగే సిట్ నిజాయితీగా దర్యాప్తు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఇతడి ఆరోపణలు కర్ణాటక వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ నేతృత్వంలోని బృందం విజ్ఞప్తి మేరకు.. సిద్ధరామయ్య ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ 15 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. అయితే, ఒకే ఒక్క ప్రదేశం.. స్పాట్ 6లో మానవ అవశేషాలు లభ్యమయ్యాయి.
ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకూ పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. జులై 3న పోలీసులను ఆశ్రయించి సంచలన ఆరోపణలు చేశాడు. తాను అక్కడ పనిచేసే సమయంలో అనేక మంది బాలికలు, మహిళలు లైంగిక దాడులకు గురై చనిపోయారని.. వారి మృతదేహాలను తానే ఖననం చేశానని తెలిపాడు. తన కుటుంబానికే చెందిన ఓ మైనర్ బాలిక పైఅధికారుల లైంగిక వేధింపులకు గురైందని.. ఆ ఘోరం తట్టుకోలేకే 2014లో అక్కడ పని మానేసి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. అప్పటి నుంచీ తనను తాను క్షమించుకోలేకపోతున్నానని.. బాధితులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఇప్పుడు బయటకు వచ్చానని పేర్కొన్నాడు.
ఈ ఆరోపణల ఆధారంగా మంగళూరు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసులో అత్యంత కలకలం రేపిన అంశం ఏమిటంటే, మృతదేహాలను త్వరగా కుళ్లిపోయేందుకు కొన్ని నేత్రావతీ నది ఒడ్డు వద్ద ఖననం చేశానని అతడు చెప్పాడు. 2010లో పాఠశాల డ్రెస్‌లో ఉన్న ఓ బాలికను మరోచోట పాతిపెట్టిన విషయాన్నీ వెల్లడించాడు. అంతేకాకుండా, కొన్ని కేసుల్లో హింస, లైంగిక దాడులకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపించాయని తెలిపాడు. జులై 11న బెళ్తంగడి న్యాయస్థానంలో విచారణకు హాజరై ఈ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఘోరం.. 12 మంది మృతి
సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు థాంక్స్ చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి