Share News

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:33 PM

జమ్మూ కశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

జమ్మూకశ్మీర్: ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా ఏర్పాడిన పరిస్థితులను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాలు మినహా మొత్తం జమ్మూ డివిజన్‌లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు తావి నది స్థాయి తగ్గింది, కానీ చీనాబ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించడం తక్షణ ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు దీని కోసం రాత్రి పగళ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. SDRF, NDRF, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ అధికారులు, పౌర పరిపాలనతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు.


జమ్మూ కశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాత్రాలోని అర్ధకుమారి సమీపంలో మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న వరదలతో 30 మంది మరణించగా, 23 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అసవరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తుంది. పలు జిల్లాలకు అలర్టులు జారీ చేసింది.


భారీ వర్షాలు జమ్మూకశ్మీర్‌లోని అనేక సేవలకు అంతరాయం కలిగించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందని, ఇంటర్నెట్ సౌకర్యం చాలా స్లోగా ఉందని తెలిపారు. ఇప్పటికీ దాదాపుగా కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్‌ డేటా చాలా స్లోగా ఉంది.. ఫిక్స్‌డ్ లైన్ వైఫై లేదు, బ్రౌజింగ్ కావడం లేదని చెప్పారు. ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లు చాలా స్లోగా ఓపెన్ అవుతున్నాయన్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు తప్ప ఇంకేం పంపలేకుండా ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014, 2019 భయంకరమైన రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.


భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం కుండపోత వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి వివరించారు. అలాగే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టుగా పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఫోన్/డేటా కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జమ్మూ విమానాశ్రయం మూసివేయడం వల్ల తాను, జమ్మూకు చేరుకోలేకపోయామని స్పష్టం చేశారు. తాను పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డివిజన్‌లోని క్షేత్రస్థాయిలో ఉన్న బృందాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు అమిత్ షాకు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Updated Date - Aug 27 , 2025 | 12:33 PM