JP Nadda: 14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:22 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రమంత్రి నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు.
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ (BJP) 14 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. ఈ 14 కోట్ల మందిలో 2 కోట్ల మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam)లో ఆదివారం నాడు జరిగిన పార్టీ ర్యాలీలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
'ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మనది. ఇందులో 14 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతి పెద్ద పార్టీ కూడా బీజేపీనే. పార్టీకి 240 మంది ఎంపీలు (Lok Sabha) ఉన్నారు. సుమారు 1,500 మంది ఎమ్మెల్యేలు, 170కి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు' అని నడ్డా చెప్పారు.
మోదీ నాయకత్వంపై ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంపై నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి కేంద్రం రూ.15,000 కోట్లు సమకూర్చిందని చెప్పారు.
సైద్ధాంతిక పునాదులు కలిగి పార్టీ నుంచి తాము వచ్చామని, గతంలో రాజకీయాలన్నీ కుటుంబం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల చుట్టూనే నడిచాయని కాంగ్రెస్ పార్టీపై నడ్డా విమర్శలు కురిపించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదని, మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని అన్నారు.
ఇవి కూడా చదవండి..
తేజస్వి పర్యటనలో భద్రతా లోపం.. దూసుకొచ్చిన యువకుడు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి