Share News

Tejashwi Yadav: 243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..

ABN , Publish Date - Sep 14 , 2025 | 07:09 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు.

Tejashwi Yadav: 243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..
Tejashwi Yadav bihar

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) సమీపిస్తున్న వేళ కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఓ సంచలన ప్రకటన చేశారు. ముజఫర్‌పూర్‌ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఈసారి బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ధీమాగా ప్రకటించారు. తేజస్వి ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ప్రభుత్వంపై విమర్శలు

దీంతోపాటు తేజస్వి యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఇలాంటి ఎత్తుగడలు ఇక పని చేయవని వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. కాంతిలో బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.


మహిళల కోసం లక్షన్నర హామీ

ప్రభుత్వం తమ ఒత్తిడితోనే పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రకటించిందని తేజస్వి అన్నారు. మేము ముందుంటాం, ప్రభుత్వం తమను అనుసరిస్తుందని సెటైర్ వేశారు. ఆర్‌జేడీ మై బెహన్ యోజనను కాపీ చేస్తూ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


అవినీతిపై ఆరోపణలు

ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ 80 వేల కోట్ల రూపాయల లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎలుకలకు రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. వంతెనలు కూలుతున్నాయని, ఆసుపత్రుల్లో రోగులకు రక్షణ లేదని విమర్శించారు. ఇలాంటి సమయంలో అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీట్ల గందరగోళం

మహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ఓటర్ల హక్కులపై ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడింది.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలపడిందని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఈ కూటమిలో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ 243 సీట్లలోనూ పోటీ చేస్తామని చేసిన ప్రకటన కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 07:17 AM