Tejashwi Security Lapse: తేజస్వి పర్యటనలో భద్రతా లోపం.. దూసుకొచ్చిన యువకుడు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:17 PM
ముజఫరాపూర్‌లోని కాంతి స్కూలులో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తేజస్వి యాదవ్ ఆవిష్కరించారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ముజఫర్‌పూర్: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ముజఫరాపూర్ జిల్లా పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. తేజస్వి ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు సిద్ధపడుతుండగా ఒక యువకుడు సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చాడు. వెంటనే ఆయన పాదాలపై పడ్డాడు.
దీనికి ముందు, ముజఫరాపూర్‌లోని కాంతి స్కూలులో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తేజస్వి యాదవ్ ఆవిష్కరించారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అనూహ్యంగా నల్లటి చొక్కా ధరించిన ఒక యువకుడు సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని తేజస్వి చెంతకువచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తేజస్వి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని షరీఫుల్ ఇస్లామ్‌గా గుర్తించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తేజస్వి యాదవ్‌పై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించగా.. ఇది తీవ్రమైన భద్రతా లోపమని మరికొందరు విమర్శించారు. తేజస్వి విషయంలో ఈ తరహా భద్రతా లోపం తలెత్తడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ ఇలాంటి భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. గత నెలలో బిహార్‌లో జరిగిన 'ఓటర్ అధికార్ యాత్ర'లో గుర్తుతెలియని వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి రాహుల్‌గాంధీని ముద్దుపెట్టుకున్నాడు. పూర్నియాలో తేజస్వి యాదవ్‌తో కలిసి బైక్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఎగురలేక రన్‌వేపై ఆగిపోయిన విమానం.. ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి