Rahul Berlin Trip: జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:36 PM
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకూ బెర్లిన్‌లో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఓవైపు జరుగుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జర్మనీ (Germany) పర్యటనకు వెళ్తున్నారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయనను 'లీడర్ ఆఫ్ పర్యటన్' అంటూ అభివర్ణించింది. విధులను నిర్లక్ష్యం చేసి తరచు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారని ఆరోపించింది. దీనికి కాంగ్రెస్ దీటుగా సమాధానమిచ్చింది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనల మాటేమిటంటూ ప్రశ్నించింది.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకూ బెర్లిన్‌లో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి. రాహుల్ విదేశీ పర్యటనపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, ఎల్ఓపీ (LoP) అంటే 'లీడర్ ఆప్ పర్యటన్' (Tourism), 'లీడర్ ఆఫ్ పార్టీయింగ్' అని రాహుల్ గాంధీ మరోసారి రుజువు చేశారని అన్నారు. రాహుల్ సీరియస్ పొల్టీషియన్ కాదని అన్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఆయన జంగిల్ సఫారీని సందర్శించారని, ఆయన ప్రాధాన్యతలేమిటో దీనినిబట్టే చెప్పవచ్చని అన్నారు. జర్మీనీకి ఎందుకు వెళ్తున్నారో తనకు తెలియదని, ఇండియాపై విషం జిమ్మేందుకు కావచ్చని అన్నారు. అది భారత్ బద్నామీ బ్రిగేడ్ అని, భారత్ బద్నామీ టూర్ అని విమర్శించారు. వెకేషన్ కోసం, భారత్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు మరోసారి ఆయన విదేశాలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ విదేశాల్లో గడుపుతుంటారని, ఆ తర్వాత తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని చెబుతుంటారని అన్నారు. ఆయనను పార్ట్ టైమ్, ఏమాత్రం చిత్తశుద్ధిలేని పొలిటీషియన్‌గా అభివర్ణించారు.
ప్రియాంక రియాక్షన్
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తిప్పికొట్టారు. ప్రధానమంత్రి సగం పనిరోజులు విదేశాల్లోనే గడుపుతుంటారని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ పర్యటనలనే ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ సైతం బీజేపీ విమర్శలను తోసిపుచ్చారు. ఎన్నికల అవకతవకలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ వద్ద కానీ , ప్రధాని వద్ద కానీ జవాబులు లేవన్నారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
సీఐసీ నియామకానికి సమావేశమవుతున్న మోదీ, అమిత్‌షా, రాహుల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి