Chief Information Commissioner: సీఐసీ నియామకానికి సమావేశమవుతున్న మోదీ, అమిత్‌షా, రాహుల్
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:44 PM
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (CIC) ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారంనాడు సమావేశమవుతోంది. తదుపరి సీఐసీని నిర్ణయించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఖాళీగా ఉన్న ఎనిమిది సమాచార కమిషనర్ల నియామకాలను కూడా కమిటీ నిర్ణయిస్తుంది.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.
ఆర్టీఐ సంబంధిత ఫిర్యాదులు, అప్పీల్స్‌కు అత్యున్నత అప్పిలేట్ అథారిటీగా సీఐసీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఇందులో కేవలం ఇద్దరు సమాచార కమిషనర్లు ఆనంది రామలింగ, వినోద్ కుమార్ తివారి ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30,838 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ముందు సీఐసీగా ఉన్న హీరాలాల్ సామరియా 65 ఏళ్లు పూర్తికావడంతో గత సెప్టెంబర్ 13న పదవీ విరమణ చేశారు. 2023 నవంబర్ 6న ఆయన సీఐసీగా నియమితులయ్యారు. కాగా, మే 21న సీఐసీ పోస్టుకోసం అడ్వర్‌టైజ్‌మెంట్ ఇవ్వడంతో 83 అప్లికేషన్లు వచ్చినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు తెలిపారు. సీఐసీలోని సమాచార కమిషనర్ ఖాళీలకు 161 అప్లికేషన్లు అందినట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
దీపావళి పండుగకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి