Share News

PM Modi: చాంతాడంత దరఖాస్తు ఫారాలెందుకు!?

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:07 AM

మా ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో.. ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా, వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.....

PM Modi: చాంతాడంత దరఖాస్తు ఫారాలెందుకు!?

  • పదే పదే 30-40 పేజీల దరఖాస్తులు చేసుకోవాలా!?.. పనికిరాని పేపర్‌ వర్క్‌కూ ఇక ముగింపు పలకాలి

  • ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ‘‘మా ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో.. ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా, వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడో విడతలో తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలను సులభతరం చేయడమేనన్నారు. నియమ, నిబంధనలన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండాలని, చట్టాలు వారికి భారంగా పరిణమించరాదని స్పష్టం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం ప్రస్తుతం పూర్తిస్థాయిలో సంస్కరణల దిశలో దూసుకుపోతోందని, స్పష్టమైన దృక్పథంతో వేగంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని చెప్పా రు. సామాన్య ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో చెప్పాలని ఎంపీలను ప్రధాని మోదీ అడిగారని, అప్పుడు వారి రోజువారీ ఇబ్బందులను తొలగించేలా సంస్కరణల పథాన్ని ప్రతి ఇంటికీ చేర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 30-40 పేజీల దరఖాస్తు ఫారాలు, పనికిరాని పేపర్‌ వర్క్‌ సంస్కృతికి ఇక ముగింపు పలకాలని, ఒకే పనికి పదే పదే దరఖాస్తులు చేసుకునే పద్ధతికి కూడా చరమగీతం పాడాలని తాను భావిస్తున్నానని, పౌరుల ఇంటి వద్దకే సేవలన్నీ చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ స్పష్టం చేశారని వివరించాయి. స్వీయ ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమ ప్రభుత్వం పౌరులను విశ్వసించిందని, అందుకే, ఎటువంటి దుర్వినియోగం లేకుండా పదేళ్లపాటు కొనసాగిందని గుర్తు చేశారని తెలిపాయి. సులభతర జీవితం, సులభతర వాణిజ్యం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మోదీ స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో సమావేశంలో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. సమావేశం తర్వాత ఆ వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు విలేకరులకు వివరించారు. చట్టసభ సభ్యులకు ప్రధాని మోదీ సుస్పష్టంగా దిశానిర్దేశం చేశారని, మూడో విడతలో సంస్కరణలతో దూసుకుపోవడమే ప్రభుత్వ ప్రత్యేకతని చెప్పారని తెలిపారు.

సోనియాకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఎక్స్‌ వేదికగా ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోనియా నాయకత్వాన్ని కొనియాడారు. దేశానికి, పార్టీకి ఆమె అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఎక్స్‌ వేదికగా సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 10 , 2025 | 03:07 AM